● యథేచ్ఛగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణ
● పాదచారులకు తప్పని తిప్పలు
● పట్టించుకోని పాలకవర్గం, అధికారులు
మెదక్ కలెక్టరేట్: అసలే ఇరుకు రోడ్లు.. ఆపై ఉన్న కొద్దిపాటి ఫుట్‌పాత్‌లు యథేచ్ఛగా ఆక్రమణకు గురికావడంతో పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నా, అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదు. కొందరు తాత్కాలికంగా వ్యాపారాలు నిర్వహిస్తుండగా, మరికొందరు పర్మనెంట్‌గా నిర్మాణాలు చేసుకొని వినియోగించుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు జరుగుతున్నా, ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం మెదక్ పట్టణంలో రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో ఒకవైపు నుంచే వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగింది. ఫలితంగా పాదచారులు రోడ్డు వెంట నడవాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా ఆక్రమణల నుంచి ఫుట్‌పాత్‌లను రక్షించి పాదచారులకు దారి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


