సర్కారు వారి పబ్లిక్‌ స్కూల్‌ | - | Sakshi
Sakshi News home page

సర్కారు వారి పబ్లిక్‌ స్కూల్‌

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

జిల్లాకు రెండు టీపీఎస్‌లు!

సర్కారు బడుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ (టీపీఎస్‌) పేరుతో నియోజకవర్గానికో పాఠశాలను ఎంపిక చేయనుంది. నర్సరీ నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు ఒకే చోట బోధన అందిస్తూ కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తేనుంది.

– మెదక్‌జోన్‌

జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌ రెండు నియోజకవర్గాలు ఉండగా, నియోజకవర్గానికొకటి చొప్పున తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఇందులో భాగంగా మెదక్‌కు సంబంధించి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను ఎంపిక చేసినట్లు తెలిసింది. అలాగే నర్సాపూర్‌కు సంబంధించి మూడు పాఠశాలల పేర్లను విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపినట్లు సమాచారం. వాటిలో ఏదో ఒకటి ఫైనల్‌ చేయనున్నారు. ఎంపికై న స్కూల్‌లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కొనసాగనుంది. సుమారు 1,500 మంది విద్యార్థులకు తగ్గకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టనున్నారు. అంతే కాకుండా దాని పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు అయితే వాటిని రద్దు చేసి అందులోని విద్యార్థులను ఈ టీపీఎస్‌లోకి పంపిచనున్నట్లు తెలిసింది.

మెదక్‌, నర్సాపూర్‌లో ఏర్పాటు

నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఒకేచోట

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం

కార్పొరేట్‌కు దీటుగా..

టీపీఎస్‌లను అంతర్జాతీయ ప్రమాణాలకు అణుగుణంగా తీర్చిదిద్దనున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల మాదిరిగా ప్రభుత్వం బస్సులను ఆయా గ్రామాలకు పంపించి ఉదయం పిల్లలను బడికి తీసుకొస్తుంది. పాఠశాల ముగిశాక మళ్లీ వారి ఇంటి వద్ద వదిలిపెట్టనున్నారు. అలాగే ఈ పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉంటారు. తరగతి గదులు సరిపోకపోతే, అదనపు గదులను నిర్మించనున్నారు. విద్యార్థులకు ఉదయం టిఫిన్‌, పాలు, లేదా రాగిజావ, మధ్యాహ్నం భోజనం, స్పోర్ట్స్‌ కోసం పీఈటీ, పీడీల నియామకం, పారిశుద్ధ్యం, తాగునీరు, అన్ని రకాల వసతులు కల్పించనున్నారు. ప్రైవేట్‌ బడులకు ధీటుగా బోధన ఉంటుందని, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, ప్రభుత్వ బడుల్లోకి పిల్లలను పంపే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. టీపీఎస్‌ పాఠశాలను పైలట్‌ ప్రాజెక్టుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయనున్నారు. ఫలితాలను భట్టి భవిష్యత్తులో ప్రతి మండలానికి ఒకటి, రెండు టీపీఎస్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని కార్పొరేట్‌ పాఠశాలలు తలదన్నే విధంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement