బ్యాంకర్లను కోరిన ప్రభుత్వం
జహీరాబాద్: బ్యాంకులకు బాకీ పడిన వ్యవసాయ రుణాలను రైతు భరోసా సొమ్ము నుంచి మినహాయించుకోవద్దని ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీకి లిఖిత పూర్వకంగా సూచించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన జీవోను సైతం అందులో పొందుపరిచింది. ఈ విషయమై రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు తగిన సూచనలు జారీ చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ కోరింది. రైతు భరోసా డ బ్బుల్ని సాగుకు అవసరమైన ముడి సరుకుల కొనుగోలు కోసమే ఉద్దేశించినందున ఈ పథకం కింద ఇచ్చిన వ్యవసాయ పెట్టుబడి మొత్తాన్ని వారి రుణా బకాయిలకింద జమచేసుకోకుండా వారికి అందజేయాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించింది.
ఖాతాలను హోల్డ్‌లో పెట్టిన బ్యాంకులు
పలువురు రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాకపోవడం, రుణమాఫీ కోసం ప్రభుత్వం కటాఫ్ తేదీ పెట్టడంతో కొందరు రైతులు ఈ పథకం కిందకు రాలేదు. దీంతో వారిని డిఫాల్టర్ కింద చేర్చారు. వారి కరెంట్ లావాదేవీ ఖాతాలను బ్యాంకర్లు హోల్డ్‌లో పెట్టారు. దీంతో రైతు భరోసా సొమ్మును పొందలేని పరిస్థితి రైతులకు ఏర్పడింది. పలు కారణాల చేత కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇలాంటి రైతులకు సంబంధించిన రైతు భరోసా సొమ్మును బ్యాంకర్లు రైతులకు చెల్లించడం లేదనే విమర్శలున్నాయి. పలువురు రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను వివిధ కారణాలతో బ్యాంకర్లు మూసివేశారు. అలాంటి రైతులు కొత్త ఖాతాలు తెరిచినా వారి అకౌంట్లను వ్యవసాయ శాఖ సకాలంలో నమోదు చేయకపోవడం, ఖాతాలు అందించేందుకు ఇచ్చిన గడువు ముగియక ముందే ఆన్‌లైన్‌లో మార్పులకు అవకాశం లేకుండా మూసివేయడం కారణంగా రైతు భరోసా సొమ్మును పొందలేని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు ఖాతాలను మార్చుకునేందుకు రైతులకు ఇచ్చిన గడువు కంటే ముందే ట్రెజరీలకు రైతుల పాత అకౌంట్లను వ్యవసాయ శాఖ అందజేయడంతో రైతు భరోసా పొందే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి సమస్యలను పరిష్కారం అయ్యేందుకు వీలుగా ఖాతాలను మార్చుకునే అవకాశం కల్పించాలనే విన్నపం రైతుల వైపు నుంచి వస్తోంది.


