ఇసుక ‘తోడే’ళ్లు
ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల్లో తరలింపు రాజకీయ అండతో రెచ్చిపోతున్నఅక్రమార్కులు మంజీరా, హల్దీలో నిత్యం జాతరే
పాపన్నపేట(మెదక్): ఇసుకాసురులు తమ అవినీతి దందాకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. అధికారులకు దొరకకుండా ఉండేందుకు గాడిదల ద్వారా రవాణ చేస్తున్నారు. శివార్లలో కుప్పలుగా పోసి, ఆపై ట్రాక్టర్లు.. లారీలు, టిప్పరల్లో అమ్ముకుంటున్నారు. వేసవి వచ్చిందంటే చాలు.. గాడిదలను బాడుగకు తెచ్చి దందాకు తెరలేపుతున్నారు. ఇక మెదక్ పట్టణంలోని హల్దీ.. మంజీరా నదులను అక్రమార్కులు జల్లెడ పడుతున్నారు. నిరాటంకంగా సాగుతున్న ఇసుక మాఫీయాకు రాజకీయాల అండ ఉండగా.. అవినీతి అధికారులు కొండగా నిలబడుతున్నారన్న ఆరోపణలున్నాయి. నెల క్రితం రాష్ట్ర మైనింగ్ విజిలెన్స్ అధికారులు వచ్చి, సంగాయిగూడ తండాలో జరుగుతున్న ఇసుక దోపిడీకి బ్రేకులు వేశారు.
రాయికోడ్ టూ పాపన్నపేట
‘శత కోటి నిబంధనలకు.. అనంత కోటి ఉపాయాలు’ అన్నట్లు అవినీతి పనులు చేసేందుకు అక్రమార్కులు గాడిదలను రంగంలోకి దించుతున్నారు. మంజీరా నదిలో ఇసుక తేలడంతో గాజులగూడెం, చిత్రియాల్, ఎంకెపల్లి శివారులో గత కొన్ని రోజులుగా అక్రమ రవాణ ప్రారంభమైంది. స్థానిక ఇసుక మాఫియా రాయికోడ్ మండలంలోని కొన్ని గ్రామాల నుంచి గాడిదలను తెప్పిస్తున్నారు. వీరు ఒక్కో ట్రాక్టర్ ఇసుకు తెచ్చేందుకు రూ.3 వేలు చెల్లిస్తున్నారు. వ్యాపారులు ఆ ట్రాక్టర్ ఇసుకను రూ.8 వేలకు అమ్ముకుంటున్నారు. ఇందులో కొందరు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారు, మరికొంత మంది స్థానికంగా పరపతి ఉన్నవారున్నారు. ఇంత జరుగుతున్నా అటు తహసీల్దార్, పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలున్నాయి.
గాజులగూడెం, చిత్రియాల్ మధ్య గాడిదలపై ఇసుక రవాణ
ఇసుక మాఫియాకు అడ్డాగా మెదక్
జిల్లాస్థాయి అధికారులు కొలువు దీరిన మెదక్ పట్టణం.. దాని పరిసర ప్రాంతాలు ఇసుక మాఫియాకు అడ్డాగా మారాయన్న ఆరోపణలున్నాయి. మెదక్ పట్టణంలోని నర్సిఖేడ్ ప్రాంతానికి చెందిన పుష్పాలవాగులో జేసీబీలు, ఇటాచీలతో వందల కొద్ది టిప్పర్ల ఇసుక తోడేస్తున్నారు. ప్రధాన రహదారికి కనుచూపు మేరలో ఉన్న హల్దీవాగులో 24 గంటల ఇసుక రవాణ జరుగుతోంది. రాయిన్‌పల్లి చెరువు, మల్కాపూర్ తండాలో సైతం యథేచ్ఛగా దోపిడీ కొనసాగుతోంది. ఇక్కడి నుంచి ప్రతి రోజు పాపన్నపేట, శంకరపేట, అల్లాదుర్గం, కొల్చారం, కౌడిపల్లి మండలాలకు టిప్పర్లలో ఇసుక రవాణ చేస్తున్నారు. టన్నుకు రూ.1,200 నుంచి రూ.1,300 చొప్పున విక్రయిస్తున్నారు. కాగా ఇసుక అక్రమ రవాణలో పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి నెల నెలా మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇలాగే ఇసుక దోపిడీ కొనసాగితే మంజీరా జలాలు ఇంకిపోయి వేసవిలో ఇబ్బందులు తతెత్తే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాడిదలతో కొత్త రకం దందా
ఇసుక తీస్తే కేసులు చేస్తాం
మంజీరా నది నుంచి ఇసుక తీస్తే కేసులు నమోదు చేస్తాం. నిల్వ చేసిన ఇసుక కుప్ప లు కూడా సీజ్ చేస్తాం.
– సతీశ్, పాపన్నపేట ఎమ్మార్వో
ఇసుక ‘తోడే’ళ్లు


