మెదక్‌లో పదో తరగతిమూల్యాంకన కేంద్రం
మెదక్ అర్బన్: దాదాపు మూడు దశాబ్దాల టీచర్ల కల నెరవేరింది. మెదక్ పట్టణంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్ష మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 1990 వరకు మెదక్‌లోని వెస్లీ ఉన్నత పాఠశాలలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేవారు. అప్పట్లో మూల్యాంకన కేంద్రాన్ని బీహెచ్‌ఈఎల్‌కు మా ర్చారు. అయితే హైదరాబాద్ నుంచి తిరిగే టీచర్లు, అధికారులకు అనుకూలంగా ఉందని, తమకు ఇబ్బందిగా ఉందని అప్పట్లో సిద్దిపేట, మెదక్ ప్రాంత టీచర్లు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. అయినా అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక జిల్లా ఏర్పాటైన తర్వాత కూడా డిమాండ్ నెరవేరలేదు. చివరకు అన్ని టీచర్ యూనియన్లు, అధికారుల కృషితో మూల్యాంకన కేంద్రం ఏర్పాటైంది.
ఉపాధ్యాయ
సంఘాల హర్షం
మెదక్‌జోన్: జిల్లాకు పదో తరగతి మూల్యాంకన కేంద్రం మంజూరు కావడంపై పలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మేడి సతీశ్‌రావు మాట్లాడుతూ.. స్పాట్ వ్యాల్యూయేషన్ సెంటర్ కోసం ఎమ్మెల్యే రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావుకు ఎన్నోసార్లు వివరించామన్నారు. వారి కృషి ఫలితంగానే నేడు జిల్లాకు సెంటర్ మంజూరైందని పేర్కొన్నారు. వారితో పాటు కలెక్టర్ రాహుల్‌రాజ్, డీఈఓ విజయకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లం మాట్లాడుతూ.. మూ ల్యాంకన కేంద్రం కోసం తమ యూనియన్ నాయకులతో కలిసి పలుమార్లు ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డికి విన్నవించామన్నారు.
విదేశీ భాషలపై
అవగాహన అవసరం
నర్సాపూర్: విదేశీ భాషలపై అవగాహన కలిగి ఉండాలని బీవీ రాజు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె అన్నారు. బుధవారం కాలేజీలో సెంటర్ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్, విష్ణు జపాన్ అవుట్‌రీచ్ సెంటర్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన చలో జపాన్–2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జపాన్ భాష, సంస్కృతి అంతర్జాతీయ ఉద్యో గావకాశాలపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జపానీస్ లాంగ్వేజ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ తైసే టోయోమారు, జపానీస్ కాలిగ్రాఫర్ హి రోకో నాగహామా, అడ్వైజర్ కెన్ యానో తదితరులతో పాటు కాలేజీ మేనేజర్ బాపిరాజు, విష్ణుస్కూల్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, ఆర్‌అండ్‌డీ డీన్ రాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జపనీస్ కాలిగ్రఫీ ప్రదర్శన ఇచ్చారు.
వసతులపై అశ్రద్ధ వద్దు
టేక్మాల్(మెదక్): పరీక్షలు రాసే ఇంటర్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలని సిబ్బందికి సూచించారు. పరీక్ష కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, విద్యుత్, వైద్యానికి సంబంధించిన వసతులపై అశ్రద్ధ చేయవద్దన్నారు. సమస్యలు ఉత్పన్నమైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ తులసీరాం, ప్రిన్సిపల్ సుభాష్‌చంద్ర, లెక్చరర్ రవికుమార్ తదితరులు ఉన్నారు.
మల్లన్న సన్నిధిలో
పాట్నా హైకోర్టు జడ్జి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని పాట్నా హైకోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారి శేష వస్త్రాలు, చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఈఓ వెంకటేశ్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్‌లో పదో తరగతిమూల్యాంకన కేంద్రం


