చకచకా.. డబ్లింగ్‌ | - | Sakshi
Sakshi News home page

చకచకా.. డబ్లింగ్‌

Feb 22 2026 8:22 AM | Updated on Feb 22 2026 8:22 AM

చకచకా.. డబ్లింగ్‌

చకచకా.. డబ్లింగ్‌

● శరవేగంగా ట్రాక్‌, వంతెనల నిర్మాణం ● భూసేకరణకు ప్రతిపాదనలు

మేడ్చల్‌– ముథ్కేడ్‌ మధ్య పనులు
● శరవేగంగా ట్రాక్‌, వంతెనల నిర్మాణం ● భూసేకరణకు ప్రతిపాదనలు

రామాయంపేట(మెదక్‌): మేడ్చల్‌– ముథ్కేడ్‌ రైల్వే ట్రాక్‌ పరిధిలోని రెండో లైన్‌ (డబ్లింగ్‌) నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈమేరకు జిల్లాలోని అక్కన్నపేట నుంచి మేడ్చల్‌ వరకు 55 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌, ట్రాక్‌ విద్యుద్దీకరణ కోసం రెండేళ్ల క్రితమే రూ. 523 కోట్లు మంజూరయ్యాయి. ఈలైన్‌ పరిధిలో ప్యాకేజీల వారీగా టెండర్‌ ప్రక్రియ పూర్తి కాగా, మేడ్చల్‌ వరకు గతంలోనే డబ్లింగ్‌ పనులు పూరయ్యాయి. ప్రస్తుతం జిల్లాలోని మనోహరాబాద్‌ మండల పరిధిలో పనులు కొనసాగుతున్నాయి.

25 చిన్న.. 3 పెద్ద వంతెనలు

డబ్లింగ్‌ పనుల్లో భాగంగా 55 కిలోమీటర్ల మేర లైన్‌లో సుమారు మూడు పెద్దస్థాయి వంతెనలతో పాటు 25 వరకు చిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. రైల్వే క్రాసింగ్‌ల మూసివేతలో భాగంగా జిల్లాలో నాలుగో చోట్ల ఆర్‌యూబీలు నిర్మించనున్నారు. రెండో లైన్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్న క్రమంలోనే విద్యుద్దీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని ఆశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ట్రాక్‌ పరిధిలో రెండో లైన్‌ నిర్మాణం కోసం మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో రెండో లైన్‌ అందుబాటులోకి వచ్చే విధంగా ఆశాఖ అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు.

పెరగనున్న రైళ్ల సంఖ్య!

జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లు అక్కన్నపేట, వడియారం, మీర్జాపల్లి ఉన్నాయి. అక్కన్నపేట స్టేషన్‌ నుంచి మెదక్‌ పట్టణానికి ప్రత్యేకంగా ట్రాక్‌ నిర్మించడంతో ఈస్టేషన్‌ జంక్షన్‌గా మారింది. ప్రతి రోజు 42 వరకు ప్యాసింజర్‌ రైళ్లతో పాటు ఆరు వరకు గూడ్స్‌ రైళ్లు నడుస్తున్నాయి. డబ్లింగ్‌ పనులు పూర్తయితే ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్య రెట్టింపు అవుతుందని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న సింగిల్‌ లైన్‌తో తరచూ క్రాసింగులు తీసుకోవాల్సిన అవసరం తలెత్తుతుంది. రెండు ట్రాక్‌లుంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. రెండో లైన్‌ నిర్మాణం పూర్తయితే ఆయా స్టేషన్ల రూపురేఖలు మారే అవ కాశం ఉంది. ఇప్పటికే వడియారం, అక్కన్నపేట స్టేషన్ల పరిధిలో భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో పాటు ఆయా స్టేషన్ల పరిధిలో ప్లాట్‌ఫాంల సంఖ్య పెరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement