ఇసుకాసురులు! | - | Sakshi
Sakshi News home page

ఇసుకాసురులు!

Feb 22 2026 8:22 AM | Updated on Feb 22 2026 8:22 AM

ఇసుకాసురులు!

ఇసుకాసురులు!

నిత్యం టిప్పర్లతో తరలింపు మామూళ్ల మత్తులో అధికారులు

జేసీబీతో మట్టిని తవ్వి టిప్పర్‌లో నింపుతున్న దృశ్యం

మెదక్‌జోన్‌: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పుష్పలవాగును అక్రమార్కులు లూటీ చేస్తున్నారు. ఇసుక, మట్టిని జేసీబీలతో తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న అధికారులు నోళ్లు మెదపటం లేదు.

వరదలకు భారీగా ఇసుక మేటలు

మెదక్‌ పట్టణం శివ్వాపల్లి తండాను ఆనుకొని పుష్పలవాగు ఉంది. వర్షాకాలంలో భారీ వరదలకు ఇసుక మేటలు పెద్ద ఎత్తున పెట్టడంతో వాటిపై అక్రమార్కుల కన్ను పడింది. నిత్యం ప దుల సంఖ్యలో జేసీబీలతో ఇసుక, మట్టిని తవ్వుతున్నారు. ఇసుకను తండా సమీపంలో నిల్వ ఉంచి అక్కడి నుంచి హైదరాబాద్‌ లాంటి నగరాలకు తరలిస్తున్నారు. మట్టిని తవ్వుతూ ఫిల్టర్ల ద్వారా ఇసుకను తయారు చేసి విక్రయిస్తున్నారు. మరికొందరు మట్టిని ఇటుక బట్టీలకు సైతం తరలిస్తున్నారు. వాగుపై ఆధారపడిన రైతుల బోరు బావుల్లో నీటి ఊటలు తగ్గిపోయి పంటలు ఎండి పోయే పరిస్థితి నెలకొంది.

వాల్టాకు తూట్లు

అక్కడ వాల్టా ఏ మాత్రం పనిచేయడం లేదు. అక్రమార్కులు ఇచ్చే ముడుపులకు అధికారులు దాసోహం అవుతున్నారు. ఈ తతంగం అంతా రెవెన్యూ, పోలీస్‌శాఖలకు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి నెల ఒక్కో అధికారికి వారి హోదాను బట్టి ముడుపులు చెల్లిస్తున్నట్లు తెలిసింది. కాగా వాగులో ఇసుక, మట్టిని తవ్వే జేసీబీలు, తరలించే టిప్పర్లు, ట్రాక్టర్లకు వాహన నంబర్లు లేవు. కొంతమంది యువకుల కనుసన్నల్లో తతంగం నడిపిస్తున్నారు.

పుష్పలవాగులో ఇసుక, మట్టి లూటీ

నా దృష్టికి రాలేదు

పుష్పల వాగు నుంచి మట్టి, ఇసుక తరలించే విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా అలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

– లక్ష్మణ్‌బాబు, మెదక్‌ తహసీల్దార్‌

Advertisement
 
Advertisement
Advertisement