పరిష్కారం అరకొరే.. | - | Sakshi
Sakshi News home page

పరిష్కారం అరకొరే..

Feb 21 2026 8:53 AM | Updated on Feb 21 2026 8:53 AM

పరిష్కారం అరకొరే..

పరిష్కారం అరకొరే..

● భూ సమస్యలకు మోక్షమెప్పుడో..? ● కార్యాలయాల చుట్టూ అన్నదాతల చక్కర్లు ● పట్టించుకోని అధికారులు

● భూ సమస్యలకు మోక్షమెప్పుడో..? ● కార్యాలయాల చుట్టూ అన్నదాతల చక్కర్లు ● పట్టించుకోని అధికారులు

మెదక్‌జోన్‌: జిల్లాలో వేలాది మంది రైతులు భూ సమస్యలతో సతమతం అవుతున్నారు. నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి ఆప్షన్‌ ఇవ్వలేదని, అందుకే భూభారతి తెచ్చామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది జిల్లాలో గ్రామ, గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల పైచిలుకు రైతులు దరఖాస్తులు అందజేశారు. కానీ వాటిలో ఇప్పటివరకు 10 శాతం కూడా పరిష్కారానికి నోచుకోలేదు.

20 వేల పైచిలుకు దరఖాస్తులు

జిల్లాలో అత్యధికంగా సాదాబైనామాలు, లావణి పట్టాల మార్పిడికి సంబంధించి 20 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. అలాగే పేర్ల మార్పిడి, భూమి తక్కువ, ఎక్కువ సరిచేయటం తదితర దరఖాస్తులు మరో 5 వేల వరకు వచ్చాయి. ముందుగా సాదాబైనామాల దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. భూమి విక్రయించిన రైతు తనకు డబ్బులు ముట్టాయని, కొనుగోలు చేసిన రైతు పేరిట పట్టా మార్పిడి చేయాలని చెబితేనే చేస్తున్నారు. ప్రస్తుతం భూమి రేట్లు పెరగటంతో సాదాబైనామా ఆధారంగా భూములు విక్రయించిన రైతులు అధికారులకు చెప్పడానికి ముందుకురావడం లేదు. అలాగే లావణి పట్టా మార్పిడిల దరఖాస్తులు అధికంగానే పెండింగ్‌లో ఉన్నాయి. నిరుపేదలకు ప్రభుత్వం ఈ పట్టాలు ఇవ్వగా, యజమాని చనిపోతే వారి పిల్లలకు పట్టా మార్పిడి కావటం లేదు. ఉమ్మడి కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముళ్లు ఉంటే ఆ కుటుంబ పెద్దకు ప్రభుత్వం పట్టా ఇవ్వగా, అందులో నుంచి తన తమ్ముడి పేర కొంత భాగం మారాల్సి ఉండగా ఆ ప్రక్రియ సాగడం లేదు. మరికొందరు అవసరాలకు ఇతరులకు విక్రయించగా, ఆ పేరూ మారటం లేదు. దీంతో ప్రభుత్వ పథకాలు వీరికి అందడం లేదు.

అధికారుల తప్పిదాలతో రైతుల తిప్పలు

క్షేత్రస్థాయిలో కొందరు వీఆర్‌ఓలు గతంలో చేసిన తప్పులకు రైతులు బలికావాల్సి వస్తోంది. ఒకరిపై ఉన్న పట్టా భూమిని మరొకరిపై మార్చటం, రికార్డులను మార్చి భూములను తక్కువ, ఎక్కువగా దిద్దటం లాంటి పొరపాట్లు చేశారు. వాటిని సరిచేసుకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కాగా ధరణి పోర్టల్‌ను మార్చి, భూ భారతి తెచ్చినా, భూ సమస్యలకు పెద్దగా పరిష్కారం దొరకటం లేదని రైతులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement