ఓపెన్‌లోనూ వాట్సాప్‌ పాఠాలు | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌లోనూ వాట్సాప్‌ పాఠాలు

Feb 20 2026 11:07 AM | Updated on Feb 20 2026 11:07 AM

ఓపెన్‌లోనూ వాట్సాప్‌ పాఠాలు

ఓపెన్‌లోనూ వాట్సాప్‌ పాఠాలు

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. చదువు మధ్యలో మానేసి 18 ఏళ్లు వయసు పైబడిన వారికి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదువుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ ఏడాది అభ్యాసకుల హాజరు శాతం పెంచి, ఓపెన్‌ స్కూల్‌ తరగతులను అభ్యాసకులకు మరింత చేరువ చేసేందుకు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కొత్త వాట్సాప్‌ చానల్‌ను ప్రారంభించింది.

సెలవుల్లో మాత్రమే తరగతులు

గతంలో ఓపెన్‌ స్కూల్‌లో పది, ఇంటర్మీడియెట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఏడాదంతా కేవలం రెండవ శనివారం, ఆదివారాల్లోనే తరగతులను నిర్వహించేవారు. వీకెండ్‌లో తరగతులు ఉండటంతో చాలామంది అడ్మిషన్‌ తీసుకున్నప్పటికీ తరగతులకు హాజరు కాకపోవడంతో అనుకున్న లక్ష్యం నీరుగారిపోయేది. ప్రభుత్వం అభ్యాసకులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి కావాల్సిన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఈ విద్యా ఏడాది హాజరు శాతంతోపాటు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కొత్తగా వాట్సాప్‌ చానల్‌ను ప్రారంభించింది. అందులో పదవ, ఇంటర్మీడియెట్‌ తరగతులకు సంబంధించి అభ్యాస దీపికలు అందుబాటులో ఉంచడమేకాకుండా ఎప్పుడూ లింక్‌ ఓపెన్‌ చేసినా పాఠాలు వచ్చేలా రూపకల్పన చేశారు.

103 అధ్యయన కేంద్రాలు

ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా 103 అధ్యయన కేంద్రాలున్నాయి. వీటిలో సంగారెడ్డిలో 49, మెదక్‌లో 21, సిద్దిపేటలో 33 ఉన్నాయి. వీటిలో సంగారెడ్డిలో పదవ తరగతిలో 2,669, ఇంటర్మీడియెట్‌లో 4,680, మెదక్‌ జిల్లాలో పదవ తరగతిలో 1,016, ఇంటర్మీడియట్‌లో 2,887, సిద్దిపేట జిల్లాలో పదిలో 616 కాగా ఇంటర్మీడియట్‌లో 1,648 మంది అభ్యాసకులు ప్రవేశం పొందారు. ఓపెన్‌ స్కూల్‌లో ఉత్తీర్ణత పొందిన అభ్యాసకులకు సంబంధించిన ధ్రువపత్రాలకు సైతం రెగ్యులర్‌ సర్టిఫికెట్లతో సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా తదుపరి పదోన్నతుల కోసం కూడా ఓపెన్‌ ద్వారా తమ ఉన్నత చదువులను కొనసాగిస్తున్నారు.

ఓపెన్‌ స్కూల్‌ బేస్‌లైన్‌ పరీక్షలు

మెదక్‌ అర్బన్‌: ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు ఈనెల 22న బేస్‌ లైన్‌ టెస్ట్‌లు ఉంటాయని డీఈఓ విజయ గురువారం ఒక ప్రటనలో పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ఈ పరీక్షలకు విద్యార్థులంతా హాజరయ్యేలా ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్లు చర్యలు తీసుకోవాలన్నారు. మిగితా వివరాలకు జిల్లా కోఆర్డినేటర్‌ వెంకటస్వామి (8008403635) నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

వాట్సాప్‌ పాఠాలుసులభంగా అర్థమవుతున్నాయి

నేను ప్రైవేట్‌ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తాను. 7వ తరగతి వరకు చదివి మధ్యలో ఆపేశాను. చదువుకోవాలనే ఆశతో ఓపెన్‌ తరగతిలో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్‌ పొందాను. ప్రస్తుతం వాట్సప్‌ చానల్‌ ద్వారా వీలైనప్పుడు చదువుకునే అవకాశం కల్పించారు. ఇందులో పాఠాలు కూడా చాలా సులభంగా అర్థమవుతున్నాయి.

– నరేశ్‌, పదవ తనగతి అభ్యాసకుడు

సద్వినియోగం చేసుకోవాలి

పెన్‌ స్కూల్‌లో విద్యను అభ్యసించిన వారికి వచ్చే సర్టిఫికెట్లు రెగ్యులర్‌ సర్టిఫికెట్లతోపాటు సమానంగా ప్రాధాన్యత ఉంటుంది. అడ్మిషన్‌ పొందిన ఇంటర్మీడియెట్‌, పదవ తరగతి అభ్యాసకులు వాట్సాప్‌లో పాఠాలు వచ్చేలా ప్రభుత్వం వాట్సప్‌ చానల్‌ను ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని ఓపెన్‌ స్కూల్‌ అభ్యాసకులు సద్వినియోగం చేసుకోవాలి.

– వెంకటస్వామి, ఓపెన్‌ స్కూల్‌,

ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌

ఉత్తీర్ణతశాతం

పెంచేందుకు చర్యలు

Advertisement
 
Advertisement
Advertisement