పరిహారం జాడేది? | - | Sakshi
Sakshi News home page

పరిహారం జాడేది?

Feb 20 2026 11:07 AM | Updated on Feb 20 2026 11:07 AM

పరిహారం జాడేది?

పరిహారం జాడేది?

ఏడాది కావొస్తున్నా అందని వైనం

నివేదికలకేపరిమితమవుతున్న అంచనాలు

ఆందోళనలో అన్నదాతలు

ప్రకృతి వైపరీత్యాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని ఏడాది కావొస్తోంది. నేటికీ రైతులకు మాత్రం పరిహారం అందలేదు. గతేడాది యాసంగి పంట చేతి కందే సమయంలో అకాల వర్షాలు, వర్షాకాలం సీజన్‌లో కుంభవృష్టి జిల్లాను అతలాకుతలం చేశాయి. జిల్లావ్యాప్తంగా 12 వేల పైచిలుకు ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి పంపారు. అయినా ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదు.

– మెదక్‌జోన్‌

జిల్లాలో గతేడాది యాసంగిలో 2.76 లక్షల ఎకరాల్లో వరితో పాటు ఇతర పంటలు సాగు చేశారు. తీరా పంట చేతికందే సమయంలో మార్చి, ఏప్రిల్‌, మేలో కురిసిన గాలి వాన భీభత్సానికి 1,507.85 ఎకరాల్లో 1,600 మంది రైతులకు చెందిన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాత రాలిపోయి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. అలాగే వర్షాకాలంలోనూ పంటలు చేతికందే సమయంలో ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు అధికారిక లెక్కల ప్రకారం 10,768.79 ఎకరాల్లో 15,844 రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ప్రధానంగా వరి, పత్తి పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ రెండు సీజన్‌లలో 12,277.24 ఎకరాల్లో 17,499 మంది రైతులకు చెందిన పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వ్యవసాయశాఖ అధికారులు తేల్చా రు. యాసంగిలో పంట నష్టం జరిగి ఏడాది కావొస్తుండగా, వానాకాలంలో వరదల కారణంగా నష్టం జరిగి నాలుగు నెలల కావొస్తోంది. అయినప్పటికి నేటికీ పరిహారం అందలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి రాక, పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.12.27 కోట్లు పెండింగ్‌

త బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పంటల బీమాను అమలు చేయలేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం అదే విధానాన్ని కొనసాగిస్తోంది. అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బతింటే నామమాత్రంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ పేరిట ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇస్తున్నారు. అదే లెక్క ప్రకారం గతేడాది యాసంగి, వానాకాలంలో ప్రభుత్వం నుంచి రైతులకు రూ. 12,27,70,000 పరిహారం రావాల్సి ఉంది.

ప్రభుత్వానికి నివేదించాం

తేడాది జిల్లాలో రెండు సీజన్లలో కలిపి 12,277.24 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి పంపించాం. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు పరిహారం రాలేదు. రాగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.

– దేవ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి

జిల్లాలో 12 వేల పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం

Advertisement
 
Advertisement
Advertisement