మత్స్యకారులకు చేయూత
సబ్సిడీపై వాహనాలు
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు చేయూతనిస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సబ్సిడీపై వాహనాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీలకు మోటార్ సైకిల్ విత్ ఐస్‌బాక్స్, బోటు, వలలు సబ్సిడీపై అందజేయనుంది. జిల్లాలో మొత్తం 309 మత్స్యకార సంఘాలు ఉన్నాయి. ఇందులోనే 24 మహిళా మత్స్యకార సంఘాలు ఉన్నాయి. మొత్తం 18 యూనిట్లు మంజూరు కాగా మత్స్యకారులకు 13 యూనిట్లు, మహిళలకు 2, ఎస్సీలకు 3 యూనిట్లు మంజూరయ్యాయి. వీటికోసం జిల్లాలోని ఆసక్తిగల మత్స్యకారులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
అర్హతలు
జిల్లాలో చేపల క్రయ విక్రయం చేస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలి. కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఎస్సీ, ఎస్టీలు మత్స్యకార సంఘాలుగా ఏర్పడి ఉండాలి. అలాగే బోటు, వలల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఘంలో కనీసం 50 మంది సభ్యులు ఉండాలి. ఆ సంఘం పరిధిలో కనీసం 100 ఎకరాల చెరువు ఆయకట్టు ఉండాలి. ఒక సంఘానికి ఒక యూనిట్ మాత్రమే ఇవ్వనున్నారు. దరఖాస్తు పత్రాలు జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో లభిస్తాయి. ఆసక్తి, అర్హత గల వారు సబ్సిడీ వాహనాల కోసం ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొని, జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో సంబంధిత పత్రాలు అందజేయాలి.
60 శాతం సబ్సిడీ
మోటర్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ వాహనం మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు 60 శాతం సబ్సీడీతో ఇస్తున్నారు. అలాగే మత్స్యకారులకు 40 శాతం సబ్సిడీతో అందజేస్తారు. ఒక వాహనం విలువ రూ.75 వేలు కాగా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.45 వేలు, మత్స్యకారులకు రూ. 30 వేల సబ్సిడీ ఇవ్వనున్నారు. అలాగే బోటు, వలలు మత్స్యకారులకు 40 శాతం సబ్సిడీతో అందజేస్తున్నారు.
జిల్లాకు 18 యూనిట్లుమంజూరు
ఈనెల 28 వరకుదరఖాస్తుల స్వీకరణ


