అడవుల సంరక్షణేదీ?
జిల్లావ్యాప్తంగా 58 వేల పైచిలుకు హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వాటిని మెదక్, రామాయంపేట, కౌడిపల్లి, తూప్రాన్, నర్సాపూర్, పెద్దశంకరంపేట రేంజ్‌లుగా విభజించారు. ముఖ్యంగా మెదక్–బోధన్ ప్రధాన రహదారి పక్కన 200 పైచిలుకు ఎరకాల్లో రెండు జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో రకరకాల జంతువులు లక్షల సంఖ్యలో ఉన్నాయి. వేసవి ప్రారంభానికి ముందే అడవులను ఆనుకొని ఉన్న రహదారుల వెంట ఫైర్‌లైన్స్ చేపట్టాలి. లేనిచో రహదారి వెంట వెళ్లే వారు బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చి రోడ్డు పక్కన పడేస్తే అడవులు దగ్ధం అవుతాయి. ఏటా జిల్లాలో వందలాది ఎకరాల్లో ఈ ఘటనలు జరుగుతున్నాయి. అయినా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల మెదక్–బోధన్ ప్రధాన రహదారి పక్కన గల బొగుడభూపతిపూర్ రిజర్వ్ ఫారెస్టులో కొంత మేర అడవి తగలబడింది. సకాలంలో స్పందించి మంటలను ఆర్పటంతో నష్టాన్ని నివారించగలిగారు. ఈ రహదారి ఎప్పుడు రద్దీగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పటికై నా అధికారులు వెంటనే స్పందించి అడవిలోని సాసర్‌పిట్లలో జంతువులకు తాగునీరు అందించటంతో పాటు ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏటా హరితహారం పథకంలో భాగంగా వర్షాకాలంలో అడవుల పెంపునకు లక్షలాది మొక్కలు నాటుతున్నారు. సంరక్షణ మాత్రం చేపట్టడం లేదు.
వేసవిలో జంతువుల దాహార్తిని తీర్చేందుకు ఆరు రేంజ్‌ల పరిధిలో 520 సాసర్‌పిట్లను నిర్మించారు. అయితే అందులో 170 సాసర్‌పిట్లు ధ్వంసం కాగా, ప్రస్తుతం 350 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఏటా ఫిబ్రవరి మొదటి వారం నుంచి వేసవి ముగిసే వరకు తాగునీటిని అందిస్తారు. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు జంతువులకు తాగునీరు అందించటం లేదు. ఫలితంగా పంట పొలాల వద్దకు వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.
అడవులను ఆనుకొని ఉన్న రహదారుల వెంట ఫైర్‌లైన్స్ చేపట్టేందుకు మూడేళ్లుగా నిధులు విడుదల కావడం లేదు. ఈ ఏడాది వర్షాకాలంలో భారీ వర్షాలు కురవటంతో అడవిలోని కొన్ని చోట్ల వాగులు, నీటి గుంతల్లో నీరు నిల్వ ఉన్నట్లు తెలిసింది. పరిశీలించి లేని చోట సాసర్‌పిట్లలో నీరు పోస్తాం. ఇందుకు సంబంధించి నివేదిక తయారు చేస్తున్నాం.
– జోజీ, డీఎఫ్‌ఓ
వేసవి సమీపిస్తోంది. అడవితో పాటు అందులో జీవిస్తున్న జంతువులకు ప్రమాదం పొంచి ఉంది. అడవులను ఆనుకొని ఉన్న రహదారుల వెంట ఫైర్‌లైన్స్ చేపట్టలేదు. ఫలితంగా ఏటా వందలాది ఎకరాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. అలాగే జంతువులకు తాగునీరు అందించాల్సిన అధికారులు ఇప్పటివరకు కార్యాచరణ ప్రారంభించలేదు.
– మెదక్‌జోన్
సాసర్‌పిట్లలో నీరు కరువు
మూడేళ్లుగా నిధులు లేవు
ఏటా వందలాది ఎకరాలు దహనం
కరువైన ఫైర్‌లైన్స్
పట్టించుకోని అధికారులు