
సంతకం కావాలి సారూ..
VðSh-sñæyŠæ íÜVóS²^èlÆŠḥMøçÜ… ´ër$Ï
మెదక్ మున్సిపాలిటీ: ‘జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల తన కూతురు పెళ్లి జరిపించాడు. ప్రభుత్వం నుంచి వచ్చే కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తు పత్రాలపై గెజిటెడ్ సంతకం తప్పనిసరి అయింది. అధికారుల చుట్టూ తిరిగినా సంతకం చేసేందుకు విముఖత చూపారు. చేసేది లేక తెలిసిన వారిని ఆశ్రయించి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో సంతకం చేయించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. అట్టి దరఖాస్తు పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేయగా తిరస్కరించారు. దీంతో మళ్లీ పత్రాలన్నీ సిద్ధం చేసి మరో గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాడు’.
కొన్నింటికి తప్పనిసరి
ప్రభుత్వ పథకాలకే కాక ప్రభుత్వ ఉద్యోగాలకు, పోటీ పరీక్షలు, పై చదువుల దరఖాస్తులకు కావాల్సిన సర్టిఫికెట్లపై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తు సమయంలో దంపతులది మొదటి వివాహమేనని ధృవీకరించడానికి ఈ సంతకం అవసరం. అలాగే లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్, పోటీ పరీక్షల దరఖాస్తులపై ఫొటో గుర్తింపు, పుట్టిన తేదీ సర్టిఫికెట్లలో పేరు మార్పు, పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్లు, కోర్టుకు సమర్పించే జిరాక్స్ పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ దరఖాస్తులోని సమాచారం వాస్తవమని ధృవీకరించినట్లు అవుతుంది.
అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
దరఖాస్తులపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించడం దరఖాస్తుదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఏ కార్యాలయానికి వెళ్లినా..గంటల తరబడి అధికారుల కోసం వేచి చూడాల్సి వస్తోంది. తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. కొందరు విసిగిపోయి పథకాలకు దరఖాస్తు చేసుకోవడం లేదు. తప్పనిసరిగా అవసరమైన వారు మాత్రం అధికారుల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే సంతకం చేసేందుకు కొందరు అధికారులు సంకోచిస్తున్నారు. మరికొందరు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తుండటంతో అందుబాటులో ఉండటం లేదు. ఆయా అంశాలను పరిగణలోకి తీసుకొని గెజిటెడ్ అధికారి సంతకం విషయంలో వెసులుబాటు కల్పించాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు.