
అమ్మాయిలకు అండగా షీటీం
డీఎస్పీ నరేందర్‌గౌడ్
చేగుంట(తూప్రాన్): చదువుకునే అమ్మాయిలకు రక్షణగా షీటీం పోలీసులు పనిచేస్తారని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ అన్నారు. చేగుంట మోడల్ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు షీటీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడారు. ఆకతాయిల వేధింపులను అరికట్టడానికి షీటీం పోలీసులు కృషి చేస్తారన్నారు. అధికంగా డబ్బులు వస్తాయని ఫోన్‌లలో వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. యువతను మత్తు పదార్థాలు డ్రగ్స్ పెడదారి పట్టేలా చేస్తాయని, వాటి నివారణ కోసం కృషి చేయాలన్నారు. అమ్మాయిలను వేధించే విషయంలో పోక్సో చట్టం గురించి వివరించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదిగితే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సంతోషిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రకళ, షీటీం సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.