
అప్రకటిత విద్యుత్ కోతలు
అల్లాడుతున్న జనం
కొల్చారం(నర్సాపూర్): ఒక్క రోజులోనే దాదాపు 10 నుంచి 15 సార్లు విద్యుత్ ట్రిప్.. ఇక గాలి దుమారం వచ్చిందంటే ఎక్కడో ఒక చోట అంతరాయం.. గంటల తరబడి వేచి చూస్తే కానీ పునరుద్ధరణ కానీ పరిస్థితులు.. జిల్లాలోని పలుచోట్ల తరచుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు. అప్రకటిత విద్యుత్ కోత లతో జనం అల్లాడుతున్నారు. పంటల సాగు మొదలుకాక ముందే కరెంటు కోతలు ఏమిటంటూ జనం ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు, పోస్టాఫీస్, మీసేవ కేంద్రాలకు వచ్చే వారు కరెంట్ కోతలతో పనులు సాగక గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మండలంలో వాణిజ్య కేంద్రంగా కొనసాగుతున్న రంగంపేటలో తరచుగా ఇలాంటి సమస్యలే ఎదురవుతున్నాయి. విద్యుత్ కోతలపై ట్రాన్స్‌కో అధికారులను అడిగితే సమాధానం దాటవేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రత్యేక విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.