● సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాలక్రైం: ఈ నెల 21న నీట్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. జిల్లా కేంద్రంలోని నీట్ కేంద్రాలను గురువారం ఆయన కలెక్టర్ కుమార్ దీపక్, నీట్ జిల్లా కో ఆర్డినేటర్ జై కిషన్ ఓజాతో కలిసి సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు, గదులు, సీసీ కెమెరాల ఏర్పాటు, పరిసర ప్రాంతాలు పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ సిబ్బంది, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ, కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రత చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కేంద్రంలో ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 1204 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ప్రతీ తరగతి గదిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్, పరీక్ష కేంద్రాల కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.


