చాలా చోట్ల కనిపించని జాబితాలోని ఓటర్లు
ఈ నెల 25నుంచి ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్
జిల్లాలో ఓటరు మ్యాపింగ్ 72శాతమే
ఓటు కొనసాగాలంటే ధ్రువీకరణ తప్పనిసరి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)తో జిల్లాలో వేలాదిగా ఓట్ల సంఖ్య తగ్గేలా కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతీ పన్నెండేళ్లకోసారి చేపట్టే ఈ ప్రక్రియలో ప్రతీ ఓటు సమగ్రంగా పరిశీలన చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో ఎస్‌ఐఆర్ చేపట్టి ఓటరు మ్యాపింగ్ చేశారు. అంటే ఓటర్లను కుటుంబంతో ఒకేచోట చేర్చి జాబితాలో చేర్చారు. జిల్లాలో మొత్తం ఓటర్లలో 72శాతమే ఓటర్ల మ్యాపింగ్ జరిగింది. అంటే మిగతా 28శాతం ఓట్లు మ్యాపింగ్ కాలేదు. చాలాచోట్ల ఓటర్లు అందుబాటులో లేరని బీఎల్‌వోలు చెబుతున్నారు. జాబితాలో పేర్కొన్న అడ్రస్‌ల్లోనూ లేరని, ఫోన్‌నంబర్లు సైతం అందుబాటులో లేవని గుర్తించారు. దీంతో మ్యాపింగ్‌లో లేని ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు, గుర్తింపును ఖచ్చితంగా రుజువు చేసుకోవాల్సి ఉంది.
జిల్లాలో..
జిల్లాలో 6.67లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 4.80లక్షల మంది ఓట్లు ఎన్నికల సంఘం మ్యాపింగ్ జరిగాయి. మిగతా ఓట్లు ఎన్యూమరేషన్ సమయంలోనే బయటపడే అవకాశం ఉంది. నిజంగా ఆ ఓట్లు ఉన్నాయా? లేవా? అనేది తేలనుంది. జిల్లాలో ఇప్పటికే 747 మంది బీఎల్‌వోలు ఓటరు మ్యాపింగ్‌కు పలుమార్లు ఓటర్ల కోసం ఇంటింటికి తిరిగారు. కొన్ని చోట్ల జాబితాలో ఉన్న ఓటర్లు మరణించారు. మరికొన్ని చోట్ల వలస వెళ్లారు. ఇంకా కొందరు వలస వెళ్లిన చోట్ల ఓటరుగా ఉండి జిల్లాలోనూ ఓటరుగా కొనసాగుతున్నారు. ఇలా డబుల్ ఓటర్లను సైతం గుర్తించారు. దీంతో ఓట్లు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొందరు మ్యాపింగ్ సమయంలో అందుబాటులో లేకపోతే ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చిప్పుడు ఫాంలో వివరాలు రాసి ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే ఓటరుగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా, మ్యాపింగ్ సమయంలో లేకపోయినా ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది.


