● అధికారులకు అవగాహన ఉండాలి ● రాష్ట్ర ప్రధాన కమిషనర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి
మంచిర్యాలఅగ్రికల్చర్: సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేయొద్దని సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ.శ్రీనివాస్‌రావు, మోహిసిన్ పర్వీన్, దేశాల భూపాల్‌రెడ్డి, బోరెడ్డి అయోధ్యరెడ్డి, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్‌తో కలిసి జిల్లా అధికారులకు సమాచార హక్కు చట్టం సమర్థవంతమైన అమలు, ప్రజలకు సమాచారం అందించడం, నిబంధనలు పాటించడం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సమాచారాన్ని పారదర్శకంగా అందించడం ప్రతీ ప్రభుత్వ అధికారి బాధ్యత అన్నారు. చట్టం లక్ష్యాలను సాధించేందుకు అధికారులు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. చట్ట ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలని, ఆలస్యమైతే ఉచితంగా అందించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ అందించిన సలహాలు, సూచనలు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. అనంతరం జిల్లాలో పెండింగ్‌లోని ఉన్న అప్పీళ్ల దరఖాస్తులను ఆయా శాఖల వారీగా పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.


