మంచిర్యాలఅగ్రిల్చర్: జిల్లాలో సూర్యుడు భగ భగ మండిపోతున్నాడు. అన్ని మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. బుధవారం వేమనపల్లి మండలం నీల్వాయిలో కనిష్ట ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలు, భీమారం, బెల్లంపల్లి, కోటపల్లి, జన్నారం, వేమనపల్లి మండలాల్లో 43 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండే ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జూన్ మూడో వారంలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రుతు పవనాలు విస్తరించి జిల్లా అంతటా వర్షాలు కురువాల్సి ఉండగా.. వరుణుడు ముఖం చాటేశాడు. పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులు ఎండల తీవ్రతతో అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.


