కాసిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని లంబాడితండాకు చెందిన దిలావత్ బూర్యానాయక్ (51) బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఎల్లారం వైపు వెళ్తుండగా ఎదురుగా బైక్‌పై వచ్చిన పోడెటి సమ్మయ్య ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని కుమార్తె అజ్మీర సమీర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్
నిర్మల్‌రూరల్: మండలంలోని ఎల్లాపల్లి ఎక్స్‌రోడ్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు రూర ల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు మేకల లోడుతో వస్తున్న వ్యాన్ ఎల్లపల్లి ఎక్స్‌రోడ్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో వ్యాన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న మధ్యప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ మున్నాఖాన్ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న సతీష్ యాదవ్ గాయాల పాలయ్యాడు. వ్యాన్లో ఉన్న షేక్ అఖిల్, సోహెల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ కృష్ణ పరిశీలించారు. కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
‘బస్సు యాత్రను అడ్డుకుంటాం’
ఇంద్రవెల్లి: ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఆదివాసీ గిరిజన బస్సుయాత్రను అడ్డుకుంటామని తుడుందెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుర్క బాపురావ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 79 ఏళ్ల స్వాతంత్య్ర పాలనలో పాలకవర్గ రాజకీయ పార్టీలు ఆదివాసీల అభివృద్ధికి పాటుపడకుండా వారిని అణగదొక్కే విధానాలకు పాల్పడుతున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చిన లంబాడీలు అక్రమంగా ఏజెన్సీ సర్టిఫికెట్లు పొంది రాజకీయ బలంతో ఉద్యోగాలు దక్కించుకున్నారన్నారు. టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించే బస్సు యాత్రను ఆదివాసీలందరు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. సమావేశంలో గోండ్వాన పంచాయతీ రాయిసెంటర్ రాష్ట్ర మేడి మెస్రం దుర్గు, ఆదివాసీ సంఘాల నాయకులు సెడ్మకి రామారావ్, కోరెంగ సీతారాం, మడావి శేకు, దుర్వ హన్ను, సోయం వినోద్, భీంరావ్, ఇంద్రు, తదితరులు పాల్గొన్నారు.


