జన్నారం: టైగర్‌జోన్ నిబంధనలు జన్నారం అటవీ డివిజన్‌లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ముందుగా రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేతను అమలు చేశారు. అనంతరం ఎకో సెన్సిటివ్ జోన్ అమలుకు దృష్టి సారించారు. ఇందులో భాగంగా టైగర్‌జోన్ పరిధిలోని ప్రధాన రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లు ఏర్పాటు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన వైల్డ్‌లైఫ్ బోర్డు సమావేశంలో టైగర్‌జోన్ నిబంధనలపై నిర్ణయాలు తీసుకున్నారు. వాహేనాల వేగం గంటకు 30కిలోమీటర్లకు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు. తపాలపూర్ నుంచి ఇందన్‌పల్లి వరకు అటవీ ప్రాంతంలో 11చోట్ల స్టాపర్లు ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు ఎక్కువగా తిరిగే, రోడ్డు దాటే ప్రాంతాల్లో మూడు చొప్పున ఏర్పాటు చేసి వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వాహనాలు అతివేగంగా వెళ్లడంతో వన్యప్రాణులు తగిలి మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. గత ఏడాది కాలంలో జన్నారం అటవీ డివిజన్‌లోని తపాలపూర్, మహ్మదాబాద్, జువ్విగూడ ప్రాంతాల్లో పలు వాహనాలు వన్యప్రాణులను తప్పించబోయి ప్రమాదాలకు గురైన సంఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో వాహనదారులు, వన్యప్రాణుల రక్షణకు నిబంధనల ప్రకారం వేగాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం కాలంగా జన్నారం అటవీ డివిజన్ గుండా భారీ వాహనాల రాకపోకలను పగలు కూడా నిషేధించారు. మండలానికి చెందిన కొందరు ఆందోళనకు దిగడంతో రాకపోకలకు అనుమతించారు. భారీ వాహనాలు ఎక్కువగా తిరుగుతుండడంతో వన్యప్రాణులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున స్టాపర్లు ఏర్పాటు చేసి వేగాన్ని అదుపులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు.


