మంచిర్యాలఅర్బన్: సాక్షి స్టడీ మెటీరియల్ పదో తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా మారింది. సులభమైన భాషలో స్పష్టమైన వివరణలతో రూపొందించడం కలిసి వచ్చింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో భయం తొలగిపోవడంతోపాటు పరీక్ష పద్ధతిపై అవగాహన ఏర్పడింది. పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా జనవరిలో ‘సాక్షి’ నిపుణులతో రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు అభ్యసన పుస్తకాలు ఎంతో ఉపయుక్తంగా మారాయి. ‘సాక్షి’ దినపత్రికలో వచ్చే ప్రశ్నలు, జవాబులు, బ్లూప్రింట్ తదితర అంశాలను ప్రతీ రోజు తరగతి గదిలో బోధించారు. మంచిర్యాల జెడ్పీహెచ్‌ఎస్(బాలుర) ప్రధానోపాధ్యాయుడు రమేష్ సూచన మేరకు ఉపాధ్యాయురాలు సుధా ప్రతీరోజు ‘సాక్షి’ పేపర్ క్లిప్పింగ్‌లను తీసుకొచ్చి రీడింగ్ కార్నర్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతూ పరీక్షలకు సన్నద్ధం చేశారు. వార్షిక పరీక్షల్లో మంచి మార్కుల సాధనకు ‘సాక్షి’ మెటీరియల్ మేలు చేసిందని జెడ్పీహెచ్‌ఎస్(బాలుర) విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.


