జన్నారం: కోతకు సిద్ధంగా ఉన్న వరిపంటపై అడవిపందులు దాడి చేసి ధ్వంసం చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. తపాలపూర్‌లో జెల్ల అక్కపెల్లి రెండెకరాల్లో వరి సాగు చేశాడు. పంట కోత దశకు వచ్చింది. శనివారం రాత్రి అడవిపందులు దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. అటవీశాఖ అధికారులు పరిహారం అందేలా చూడాలని బాధిత రైతు కోరుతున్నాడు.
బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఇద్దరి అరెస్టు
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలో మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో రాహుల్ కాంత్ ఐపీఎస్ తెలిపారు. సుభాష్‌నగర్‌కు చెందిన ఎర్రపోగుల పవన్ కుమార్, టైలర్స్ కాలనీకి చెందిన మర్రి రాధ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేశారు. సదరు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. ఆందోళనకు గురైన బాధితుడు పలుమార్లు డబ్బులు సైతం ఇచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితులను దస్నాపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.


