పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 11న నిర్వహించనున్న మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పీవో, ఏపీవోలకు నిర్వహించిన శిక్షణకు మున్సిపల్ కమిషనర్ అన్వేష్‌తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా ఎన్నికల ఏర్పాట్లు చేశామన్నారు. ఒకరికి బదులు మరొకరు ఓటు వేయడం, ఒకటికి మించి వేయడం జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కేంద్రాల్లో లైటింగ్, ఫ్యాన్లు, తాగునీరు, మూత్తశాలలు, తదితర వసతులు కల్పించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 11న పోలింగ్, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 12న రీపోలింగ్ ఉంటుందని, 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.
బెల్లంపల్లి: మున్సిపల్ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్లో పీవోలు, ఏపీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్‌ను పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.సంపత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


