అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
తలమడుగు: అధిక వర్షాలతో పంట దిగుబడిపై ఆశలు ఆవిరైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో చోటు చేసుకుంది. అప్పు తీర్చేదెలా అని రుయ్యాడికి చెందిన కుమ్మరి ప్రేమేందర్ (41) బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమేందర్ తనకున్న 28 గుంటల వ్యవసాయ భూమితో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈ సీజన్‌లో పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తులు, బ్యాంకులో దాదాపు రూ.5 లక్షల వరకు అప్పు తెచ్చాడు. అధిక వర్షాల కారణంగా పంట పూత, కాత లేక దిగుబడిపై ఆశలు సన్నగిల్లాయి. మనస్తాపం చెందిన ఆయన ఆదివారం తన పశువులపాక సమీపంలో పురుగుల మందు తాగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య గణిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
పురుగుల మందు తాగి కార్మికుడు..
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఊరు రామకృష్ణాపూర్‌కు చెందిన మెంగని శ్రీకాంత్ (30) అనే సింగరేణి కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాంత్‌కు భార్యతో తరుచూ గొడవలు కావడంతో విడాకులు తీసుకుంది. ఒంటరిగా ఉంటున్న శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. ఒంటరి జీవితంతో మనస్తాపానికి గురై శనివారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్‌ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
రైలు కిందపడి యువకుడు..
మంచిర్యాలక్రైం: కుటుంబ కలహాలతో యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ సంపత్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ మండలం సింగపూర్ గ్రామానికి చెందిన జాన గంగాధర్ కుమారుడు శ్రీనివాస్(39) ఈ నెల 2న సాయంత్రం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ సోమవారం తెల్లవారుజామున మంచిర్యాల ఏసీసీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.


