
జాతీయ రహదారి పనులు చేపట్టండి
చెన్నూర్: నియోజకవర్గ పరిధిలోని భీమారం–చెన్నూర్ మధ్యగల జోడువాగు 63వ జాతీయ రహదారి పనులు త్వరగా చేపట్టాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఈ మేరకు వివేక్ ఢిల్లీలో కేంద్ర మంత్రిని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిశారు. జోడువాగు ఎన్‌హెచ్ 63 పనులు వేగవంతం చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రహదారి నిర్మాణానికి నిధులు మంజూరై ఏడాదైనా డీపీఆర్ దశలోనే ఉందని తెలిపారు. త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రవాణా సౌకర్యం మె రుగవుతుందని, ప్రజల ఇబ్బందులు తీరుతాయని పేర్కొన్నారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. అంతర్జాతీయ రోడ్ల నిర్మాణంతో చెన్నూర్ ప్రాంతం అ భివృద్ధి చెందుతుందని చెప్పారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారని, డీపీఆర్ ఆమోద పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారని మంత్రి, ఎంపీ తెలిపారు.