
పేదల కళ్లలో ఆనందం
● రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్
చెన్నూర్: ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, పేదల కళ్లలో ఆనందం చూస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆదివారం ప్రొసీడింగ్ పత్రాలు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి అందించారు. అనంతరం చెన్నూర్ నుంచి హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాలకు ఐదు కొత్త బస్సులు ప్రారంభించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌లో చెన్నూర్ నియోజకవర్గంలో 4 వేల ఎకరాలు మునిగి రైతులు నష్టపోయారని తెలిపారు. గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఫేక్ వార్తలు ప్రచారం చేసేవారిపై నిఘా పెట్టాలని పోలీసులకు సూచించారు. చెన్నూర్ నియోజకవర్గంలో రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అనంతరం సంవిధాన్ లీడర్‌షీప్ ప్రొగ్రామ్–వైట్ టీషర్టు ఇనిషియేటివ్ మెమోంటోలను అవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ భానుప్రసాద్, మంచిర్యాల డీఎం శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, ఇంజినీర్ సధాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.