నిలిచిన ఇసుక రవాణా | - | Sakshi
Sakshi News home page

నిలిచిన ఇసుక రవాణా

Jul 7 2025 6:36 AM | Updated on Jul 7 2025 6:36 AM

నిలిచిన ఇసుక రవాణా

నిలిచిన ఇసుక రవాణా

● నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం ● పనిలేక కూలీల తిప్పలు

బెల్లంపల్లి: జిల్లాలో 12 రోజులుగా ఇసుక రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో భవన నిర్మాణ రంగంపై ప్రభావం పడింది. ఇళ్ల నిర్మాణాలతోపాటు ఇందిరమ్మ పథకానికి ఇసుక దొరకడం లేదు. ఫలితంగా, రోజువారీ కూలీలు, ట్రాక్టర్‌ యజమానులు, కాంట్రాక్టర్లు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 400 ట్రిప్పుల ఇసుక బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. సరఫరా ప్రక్రియలో జాప్యం కొనసాగుతోంది.

ఖర్జీ రీచ్‌ ఆధారం..

నెన్నెల మండలంలోని ఖర్జీ రీచ్‌ జిల్లా ఇసుక రవా ణాకు ప్రధాన వనరుగా ఉంది. బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, తాండూర్‌ మండలాల వినియోగదారులకు ఈ రీచ్‌ నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా ఇసుక బుక్‌ చేసుకున్న వారు గత నెల 24 నుండి సరఫరా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఇసుక బుకింగ్‌ తాత్కాలికంగా నిలిపివేయడంతో, వినియోగదారులు, ట్రాక్టర్‌ యజమానులు నిరాశలో ఉన్నారు.

వర్షాలు, సాంకేతిక సమస్యలు..

ఖర్జీ రీచ్‌కు వెళ్లే మార్గంలో వర్షాల కారణంగా వరద నీరు నిలిచింది. ట్రాక్టర్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ కారణంతో ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే, వరద నీరు లేని ప్రత్యామ్నాయ రీచ్‌లను గుర్తించి, ఇసుక సరఫరాను సాఫీగా కొనసాగించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ఆన్‌లైన్‌ బుకింగ్‌లో అవకతవకలు..

ఇసుక బుకింగ్‌ కోసం ఉపయోగించే ఆన్‌లైన్‌ యాప్‌లో సాంకేతిక సమస్యలు వినియోగదారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. యాప్‌ ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు నిలిచిపోతుందో అనిశ్చితి నెలకొంది. దీనికితోడు, కొందరు ట్రాక్టర్‌ యజమానులు ముందస్తు సమాచారంతో అధిక ట్రిప్పులను బుక్‌ చేసుకుని ఒక్కో ట్రిప్పునకు రూ.4 వేలు వసూలు చేస్తున్నారు. రాత్రిపూట వాగులు, వంకల నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు.

పరిష్కారానికి చర్యలు..

ఇసుక రవాణా స్తంభన కారణంగా భవన నిర్మాణ రంగం తీవ్రంగా నష్టపోతోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక సరఫరాను పునరుద్ధరించడానికి మైనింగ్‌ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ రీచ్‌లను గుర్తించడం, ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపాలను సరిదిద్దడం, అక్రమ రవాణాను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వాగులో నీరు రావడంతో..

ఖర్జీ వాగులో ఇటీవల కొత్తగా చెక్‌ డ్యామ్‌ కట్టారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వరద ఈ చెక్‌డ్యాంలో నిలిచి ట్రాక్టర్లు రాకపోకలు సాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సిబ్బందిని సోమవారం ఇసుక రీచ్‌కు పంపించి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటాం. వరదనీరు ఉంటే.. మరో చోట ఇసుక తవ్వకాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.

– జగన్మోహన్‌రెడ్డి,

మైనింగ్‌ ఏడీ, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement