
అడవిలో యాంటీపోచింగ్ షెడ్లు
జన్నారం: రాత్రి,పగలు అడవిలో తిరుగుతూ వన్యప్రాణుల సంరక్షణ కోసం తమవంతుగా కృషి చేస్తున్న యాంటీపోచింగ్ సిబ్బందికి అటవీశాఖ నివాస సౌకర్యం కల్పించింది. అడవిలో అందమైన షెడ్ల నిర్మాణం చేపట్టింది. వాన, వేసవి, చలికాలాల్లో నీడ సౌకర్యం కోసం, సిబ్బంది బస చేసేందుకు వీలుగా టైగర్‌జోన్‌లోని జన్నారం డివిజన్‌లో మొదటిసారిగా ఇందన్‌పల్లి రేంజ్‌లో షెడ్ల నిర్మాణం చేపట్టింది.
రేంజ్‌లో మూడుచోట్ల
జన్నారం అటవీ డివిజన్‌లోని ఇందన్‌పల్లి రేంజ్‌లో మొదటిసారిగా మూడు చోట్ల యాంటీపోచింగ్ షెడ్లు నిర్మాణం చేపట్టారు. ప్రతి ఏటా వచ్చే నిధులతో ఈసారి సిబ్బంది కోసం షెడ్ల పనులు చేపట్టారు. ఇదిలా ఉంటే ఒక్కో యాంటీపోచింగ్ టీంలో ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిలోనే తిరుగుతూ వన్యప్రాణులు, అడవుల రక్షణ కోసం పని చేస్తుంటారు. సాయంత్రం, ఉదయం వంట, సామగ్రిని షెడ్లలో ఉంచుకుని తిరిగి రాత్రి ఇక్కడే బస చేస్తారు. సిబ్బంది రాత్రి ఉండేందుకు జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్‌సింగ్ ఆదేశాల మేరకు రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ ఈ నిర్మాణాలు చేపట్టారు. వీటి పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో షెడ్లను ప్రారంభించనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
సిబ్బంది విధులు
స్మగ్లింగ్ నిరోధానికి అటవీ అధికారులతోపాటు బేస్‌క్యాంపు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరి కోసం ఇప్పటికే డివిజన్‌లో బేస్‌క్యాంపులు నిర్మించారు. వారు రాత్రి, పగలు అడవిలో ఉంటూ స్మగ్లింగ్ నిరోధానికి, అడవుల ఏదైన సమస్య ఉంటే అధికారులకు సమాచారం ఇస్తారు. వన్యప్రాణుల సంరక్షణకు, ఏదైన వన్యప్రాణి గాయపడ్డ అక్కడికి చేరుకుని వాటిని కాపాడటం కోసం యాంటీపోచింగ్ సిబ్బందిని నియమించారు. వన్యప్రాణులకు నీటి సౌకర్యం, ఆహారం కల్పించడానికి అటవీ అధికారుల ఆదేశాల మేరకు పని చేస్తుంటారు. వర్షాకాలంలో గడ్డి పెంపకం, వేసవిలో నీటి సౌకర్యం కోసం పనిచేస్తుంటారు. వీటితోపాటు స్మగ్లింగ్, వేట నిరోధం కోసం అటవీశాఖ అధికారుల ఆదేశాల ప్రకారం పని చేస్తుంటారు.
ఇందన్‌పల్లి రేంజ్‌లో నిర్మాణం
సిబ్బందికి సౌకర్యాలు
ఉన్నతాధికారుల ఆదేశాలతో..
యాంటీపోచింగ్ సిబ్బందికి అడవిలో సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో రేంజ్ పరిధిలో మూడు షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభిస్తాం.
– కారం శ్రీనివాస్, రేంజ్ అధికారి

అడవిలో యాంటీపోచింగ్ షెడ్లు