తల్లి కాటికి.. తండ్రి కటకటాలకు...! | - | Sakshi
Sakshi News home page

తల్లి కాటికి.. తండ్రి కటకటాలకు...!

Published Mon, Jun 17 2024 1:18 AM | Last Updated on Mon, Jun 17 2024 1:23 PM

-

శుభకార్యం జరగాల్సిన ఇంట్లో చావుడప్పు 

 భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య 

 రెండు రోజుల్లో కూతురి శారీ ఫంక్షన్‌..  అంతలోనే విషాదం 

మంచిర్యాలక్రైం: శుభకార్యం జరగాల్సిన ఇంట్లో తల్లి తొందరపాటు నిర్ణయం విషాదం మిగిల్చింది. రెండు రోజుల్లో కూతురి నూతన వస్త్రాలంకరణ కోసం అలంకరణ వస్తువులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసింది. ఫంక్షన్‌ నిర్వహణ విషయమై భార్యభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు ఆ ఇంటి ఇల్లాలిని బలితీసుకుంది. తల్లి కాటికి వెళ్లగా, తండ్రి కటకటాలపాలయ్యాడు. దీంతో రెండు రోజుల్లో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. .

13 ఏళ్లుగా వేధింపులు..
ఎస్సై మహేందర్‌, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని హమాలీవాడకు చెందిన బుర్రి రాజమోహన్‌–సుగుణ కూతురు స్నేహశీల(36) మందమర్రికి చెందిన మహేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మహేశ్‌ ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. దీంతో పెళ్లయిన ఏడాది నుంచే కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. 13 ఏళ్లుగా భర్త వేధింపులు భరించిన స్నేహశీల కూతురి శారీ ఫంక్షన్‌ విజయంలో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన స్నేహశీల ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఉపాధ్యాయురాలిగా..
స్నేహశీల పీజీ, బీఈడీ చదివింది. కుటుంబ పోషణకు ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాద్యాయురాలిగా పనిచేస్తూ ఇద్దరు ఆడపిల్లలను, భర్తను పోషిస్తోంది. ఇటీవలే ప్రిన్సిపాల్‌గా పదోన్నతి సాధించింది. దీంతో మంచిర్యాలలోని హమాలీవాడలోని ఓ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి అద్దెకు ఉంటుంది. మహేశ్‌ నిత్యం మద్య తాగివచ్చి భార్యతో గొడవ పడేవాడు. మద్యానికి, పేకాటకు డ బ్బులు కావాలని డిమాండ్‌ చేసేవా డు. దీంతో స్నేహశీ ల తన ఏటీఎం కా ర్డు, బ్యాంకు పాస్‌ బుక్‌ భర్తకే అప్పగించింది. అయినా వే ధింపులు అగలేదు.

రెండు రోజుల్లో శారీ ఫంక్షన్‌..
ఇక మహేశ్‌–స్నేహశీల దంపతుల పెద్ద కూతురు మనస్వికి రెండు రోజుల్లో శారీ ఫంక్షన్‌ చేసేందుకు స్నేహశీల తాను పనిచేస్తున్న స్కూల్‌ యాజమాన్యం వద్ద నెలసరి వేతనంతోపాటు మరి కొంత డబ్బు అడ్వాన్స్‌ రూపంలో తీసుకుంది. ఫంక్షన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి మహేశ్‌ మద్యం సేవించి ఇంటికి వచ్చి కూతురు ఫంక్షన్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని స్నేహశీలతో గొడవ పడ్డాడు. తనకూ డబ్బులు కావాలని విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో మనస్తాపం చెందిన స్నేహశీల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు కాసేపటి తర్వాత వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించింది. దీంతో కిందకు దింపి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.

భర్త వేధింపులే కారణమని..
స్నేహశీల మృతికి భర్త మహేశ్‌ కారణమ ని ఆమె తల్లి సుగుణ, తమ్ముడు రాఘవ ఆరోపించారు. మహేశ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు. మహేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. స్నేహశీల మృతి వార్త తెలుసుకున్న ఆమె పనిచేసే పాఠశాల ఏజీఎం రాజు ఆస్పత్రి కి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చా రు. కూతుళ్లకు అండగా ఉంటామని, అన్నివిధాలా ఆదుకుంటానని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement