
లహరి.. లాభాల ప్రయాణం
● బస్సులకు ప్రయాణికుల ఆదరణ ● జిల్లాలో ఎనిమిది బస్సులు
మంచిర్యాలఅర్బన్: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఏసీ స్లీపర్ లహరి బస్సులకు ఆదరణ లభిస్తోంది. మూడు నెలల క్రితం మంచిర్యాల నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ ప్రత్యేకంగా పరిచయం చేసింది. ప్రైవేటు బస్సులకు దీటుగా రూపొందించిన నాలుగు ఏసీ స్లీపర్, నాలుగు నాన్ ఏసీ స్లీపర్, రాజధాని మంచిర్యాల డిపోకు వచ్చాయి. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరి, అమ్మ ఒడి అనుభూతిగా నామకరణం చేసింది. వేసవి నేపథ్యంలో మంచిర్యాల–హైదరాబాద్‌కు ఎనిమిది బస్సులు నడిపిస్తుండగా ఏసీ బస్సులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దీంతో లాభాల బాట పడుతున్నాయి. లగ్జరీ బస్సుల కంటే కాస్త టికెట్ ధరలు ఎక్కువైనప్పటికీ ఇప్పుడిప్పుడే ప్రయాణికులు ఆదరిస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు ఉండడంతో టికెట్ ధరలు చూడకుండా ప్రయాణం చేస్తున్నారు. లహరి ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 33 సీటింగ్, అప్పర్‌తో 15బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్‌ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతోపాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతీ బెర్త్ వద్ద రీడింగ్ ల్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఏసీ స్లీపర్ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ సిస్టంతోపాటు నాక్ బటన్ సదుపాయం కల్పించారు. ప్రతీ బస్సులో (కేబీన్, బస్సులోపల) రెండు సీసీ కెమెరాలు అమర్చారు. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సకు ముందు వెనక ఎల్‌ఈడీ బోర్డులతోపాటు పలు సౌకర్యాలున్నాయి. నాన్ ఏసీ బస్సుల కంటే ఏసీ బస్సులకు డిమాండ్ పెరుగుతోంది. వేసవి కావడం.. ఆధునిక సౌకర్యాలు ఉండడంతో లహరి బస్సులకు మంచి ఆదరణ ఉందని డీఎం రవీంద్రనాథ్ తెలిపారు.