● నకిలీ పత్రాల తయారీ దందాలో గట్టుకు లింకులు
● కూపీ లాగుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు
గట్టు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ కేంద్రంగా కొనసాగిన నకిలీ పత్రాల వ్యవహారం గట్టుకు తాకింది. ఇక్కడి పైరవీకారులు కొందరు ఏకంగా అయిజలో పట్టుబడిన ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా నకిలీ పత్రాలతో వ్యవహారాలను కొనసాగించినట్లు సమాచారం. అయిజకు చెందిన ప్రింటింగ్ ప్రెస్‌ను గట్టు మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని నకిలీ పత్రాల సృష్టికి కేంద్రంగా మార్చుకుని వ్యవహారాన్ని కొనసాగించినట్లు తెలిసింది. నకిలీ పత్రాలను సృష్టించుకుని వాటితో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులు పెద్దఎత్తున లబ్ధి పొందేలా చేసి.. వచ్చిన డబ్బుల్లో వాటా పంచుకుని తిన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంపై రెవెన్యూ, పోలీసులు కూపీ లాగుతున్నారు.
18 స్టాంపుల గుర్తింపు..
అయిజ ప్రింటింగ్ ప్రెస్‌లో గట్టు మండలానికి సంబంధించి 18 స్టాంపు (ముద్ర)లను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా పాఠశాలలకు చెందిన హెచ్‌ఎం ముద్రలు ఉన్నట్లు గుర్తించారు. పైరవీకారుల ద్వారానే నకిలీ పత్రాలతో సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రైతుబీమా, కల్యాణలక్ష్మి, భూభారతి పొర్టల్‌కు సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించి, వాటి ద్వారా పెద్దఎత్తున లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. ఇందువాసి గ్రామంలో కొద్దిరోజుల క్రితం భూ యజమానికి వారసులు ఉన్నప్పటికీ వేరే వ్యక్తి తానే వారసుడినని తప్పుడు ధ్రువీకరణ పత్రంలో భూ బదలాయింపు చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యవహారం వెలుగులోకి రావడంతో పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. రైతుబీమా పరిహారంలోనూ నకిలీ ధ్రువీకరణ పత్రాలను జత చేసి, ప్రభుత్వ సొమ్మును పెద్దఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక కల్యాణలక్ష్మి పథకంలో ఓ గ్రామంలో నలుగురు పిల్లలున్న వారికి కల్యాణలక్ష్మి చెక్కును పైరవీకారుడు ఇప్పించినట్లు సమాచారం. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని రకాల నకిలీ ధ్రువీకరణ పత్రాలను అయిజ ప్రింటింగ్ ప్రెస్‌లో సృష్టించుకుని పెద్దఎత్తున ప్రభుత్వ సొమ్మును కాజేశారు. అయిజ ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా కొనసాగిన నకిలీ పత్రాల వ్యవహారం బయటకు పొక్కడంతో విషయం తెలుసుకున్న కొందరు పైరవీకారులు తమ దగ్గర ఇంకా దాచుకున్న పత్రాలను తారుమారు చేసి జాగ్రత్తపడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అనేక వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, నకిలీ దందాను పూర్తిగా అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.


