పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

Apr 17 2026 1:32 PM | Updated on Apr 17 2026 1:32 PM

డిండి ఎత్తిపోతలతో పాలమూరు

రైతాంగానికి తీవ్ర నష్టం

చేతులెత్తి దండం పెడ్తున్నాం..

జిల్లాను కాపాడండి

మెట్టుగడ్డ: పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌ రెడ్డి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌ లో పెండింగ్‌ ప్రాజెక్టుల సాధనకు జేఎసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, జిల్లా రైతంగానికి మేలు జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి పాలమూరు అంటేనే వెనకబడ్డ జిల్లా అని ముద్ర వేసి అన్ని రంగాల్లో వెనకబడేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరుకు మొండి చేయి చూపిస్తూ, నల్లగొండకు మేలు జరిగేలా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 2013లోనే పాలమూరు ఎత్తిపోతల పధకానికి 72 జీవో ద్వారా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడం పాలమూరు ప్రజల దురదృష్టమన్నారు. శ్రీశైలం నుంచి నీటిని తీసుకొని పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి 2015లో 105 జీవోతో ప్రాజుక్టు నిర్మాణానికి పైలాన్‌ ఆవిష్కరించారు. కానీ ప్రారంభమై 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారని, కానీ ఉదండాపూర్‌లో పదిశాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. ఇప్పుడు డండి లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు పేరుతో మరోసారి జిల్లా నీటిని నల్లగొండకు తరలించుకుపోయే పథకానికి శ్రీకారం చుట్టడంతో ఈ జిల్లాకు పెద్ద నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం, జిల్లా మంత్రులు కిమ్మనకుండా ఉండటం చాలా బాధాకరమన్నారు. మహబూబ్‌నగర్‌ నీటిని మరో జిల్లాకు తరలించాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని జిల్లా రైతాంగంలో చైతన్యం కల్పించి ఉద్యమానికి శ్రీకారం చూడ్తామని తేల్చి చెప్పారు. జిల్లాకు మంచి జరిగేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులకు చేతులెత్తి దండం పెడ్తున్నాం.. జిల్లాను కాపాడాలని కోరుతున్నామని తెలి పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాఘవచారి, హనీఫ్‌, వీరబ్రహ్మచారి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement