ఎర్రవల్లి: వడ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ 44వ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా వెలుగోడు నుంచి దాదాపు 300 క్వింటాళ్ల వరి ధాన్యంతో ఓ లారీ బుధవారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు బయలుదేరింది. గురువారం ఉదయం లారీ జింకలపల్లి స్టేజీ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఇంజిన్‌లో తీవ్రమైన పొగలు రావడంతో పాటు మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై లారీని రోడ్డు పక్కన నిలిపి కిందకు దూకి, ప్రాణాలను కాపాడుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా.. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో లారీ ఇంజిన్‌తో పాటు క్యాబిన్, కొన్ని ధాన్యం బస్తాలు పూర్తిగా కాలిపోవడంతో దాదాపు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు లారీ డ్రైవర్ కరీముల్లా తెలిపారు. ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఇటిక్యాల ఎస్‌ఐ రవిరాథోడ్, కోదండాపురం ఎస్‌ఐ తరుణ్‌కుమార్‌రెడ్డి హైవే సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనా స్థలాన్ని అలంపూర్ సీఐ ప్రదీప్‌కుమార్ సందర్శించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. లారీ డీజిల్ ట్యాంకుకు మంటలు వ్యాపించకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో పోలీసులు తక్షణమే స్పందించిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపించారు.
రూ.5 లక్షల వరకు ఆిస్తి నష్టం


