అసంపూర్తి పనులతో అవస్థలు | - | Sakshi
Sakshi News home page

అసంపూర్తి పనులతో అవస్థలు

Mar 10 2025 10:26 AM | Updated on Mar 10 2025 10:23 AM

జడ్చర్ల: పట్టణంలోని సిగ్నల్‌గడ్డ వద్ద రహదారి విస్తరణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పని ప్రదేశంలో యంత్రాలు, కార్మికులు, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ సుమారు మూడు నెలలుగా కనిపించడం లేదు. రోడ్డు, రైల్వే వంతెన ఇరుకుగా ఉండడంతో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. మూడేళ్ల కిందట రహదారి విస్తరణకు అంకురార్పణ జరిగింది. నాటి నుంచే మరిన్ని కష్టాలు మొదలయ్యాయి.

రూ.45.81 కోట్ల వ్యయం..

ఈ ప్రాంతంలో రహదారి విస్తరణ పనులకు కేంద్రం రూ.45.81 కోట్లు మంజూరు చేసింది. వంతెన నిర్మాణానికి రైల్వే విద్యుత్‌లైన్‌ ఆటంకంగా ఉండటంతో పనుల్లో జాప్యం జరిగింది. రెండునెలల కిందట రైల్వేశాఖ అధికారులు అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించినా.. ఇప్పటి వరకు పనులు తిరిగి ప్రారంభం కాలేదు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవరిస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

● సిగ్నల్‌గడ్డ ప్రాంతం పట్టణానికి కూడలిలా ఉంది. అటు హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా తదితర దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలు, ఇటు ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌, వనపర్తి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ కూడలి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రాంతంలో పనులు చేపట్టేందుకు పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా గంటల తరబడి రాకపోకలకు నిలిచిపోతున్నాయి. రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడం, విస్తరణ పనులు చేపట్టకపోవడంతో భారీ వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ము లేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఒకవైపు రహదారి పనులు పూర్తి చేస్తామని స్థానిక నాయకులు, ప్రజలకు కాంట్రాక్టర్‌ చెప్పినా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. మరో రెండునెలల్లో వర్షాకాలం ప్రారంభమైతే పనులు చేసే పరిస్థితి ఉండదు. ఇప్పటికై నా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, కలెక్టర్‌ స్పందించి రోడ్డు పనులపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

పనుల్లో వేగం పెంచాలి..

కూడలిలో ఎక్కడికక్కడ గుంతలు ఉన్నాయి. దుమ్ము విపరీతంగా వస్తుండటంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, పాదచారులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి.

– బాలవర్ధన్‌న్‌గౌడ్‌, జడ్చర్ల

దుకాణాలు

మూసుకోవాల్సి వస్తుంది..

సిగ్నల్‌గడ్డ వద్ద రహదారి విస్తరణ పనులు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. దుమ్ము విపరీతంగా వస్తుండటంతో వ్యాపారాలు సాగడం లేదు. దుమ్ము కారణంగా దుకాణాలు మూసుకోవాల్సి వస్తోంది. అధికారులు ఎంతమాత్రం స్పందించడం లేదు. త్వరగా రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి.

– అబిదాలి మహ్మద్‌ ,జడ్చర్ల

త్వరలో బీటీ పనులు చేపడతాం

బీటీ రోడ్డు పనులు త్వరలోనే చేపడతాం. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా రహదారి విస్తరణ పనులు పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటాం. బ్రిడ్జి కూడా త్వరితగతిన నిర్మిస్తాం.

– రవి, ఏఈ, నేషనల్‌ హైవే అథారిటీ

జడ్చర్ల సిగ్నల్‌గడ్డ వద్ద నిలిచిన రహదారి పనులు

మట్టి, దుమ్ముతో రాకపోకలకు ఇబ్బందులు

ట్రాఫిక్‌ సమస్యలు.. చోద్యం చూస్తున్న అధికారులు

అసంపూర్తి పనులతో అవస్థలు 1
1/3

అసంపూర్తి పనులతో అవస్థలు

అసంపూర్తి పనులతో అవస్థలు 2
2/3

అసంపూర్తి పనులతో అవస్థలు

అసంపూర్తి పనులతో అవస్థలు 3
3/3

అసంపూర్తి పనులతో అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement