రేపు మిషన్‌ భగీరథనీటి సరఫరా నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

రేపు మిషన్‌ భగీరథనీటి సరఫరా నిలిపివేత

Mar 7 2025 12:38 AM | Updated on Mar 7 2025 12:38 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): మన్యంకొండ నుంచి సరఫరా అయ్యే మిషన్‌ భగీరథ నీటిని ఒకరోజు పాటు నిలిపి వేయనున్నట్లు మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ఈఈ వెంకట్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపి వేయన్నుట్లు పేర్కొన్నారు. మన్యంకొండ నుంచి మరికల్‌ వెళ్లే దారిలో దేవరకద్ర ఆర్చ్‌ వద్ద మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకేజీ అవుతున్న నేపథ్యంలో ఆ పైపులు తీసి కొత్త పైపులు అమర్చాల్సి ఉందని తెలిపారు. దీంతో దేవరకద్ర, నర్వ, మరికల్‌, ఊట్కూర్‌, నారాయణపేట, దామరగిద్ద మండలాలు పూర్తిగా, కౌకుంట్ల, చిన్నచింతకుంట, మక్తల్‌, ధన్వాడ మండలాలు పాక్షికంగా, మక్త ల్‌, నారాయణపేట మున్సిపాలిటీలు పూర్తిగా మొత్తం 245 గ్రామాలు మరియు 2 మున్సిపాలిటీల్లో నీటి సరఫరా ఉండదని వివరించారు.

కృష్ణా జలాల కేటాయింపుపై పోరాడాలి

పాలమూరు: కృష్ణా బేసిన్‌లోని అన్ని జిల్లాల్లో నీటి వాటా కోసం కృష్ణానది జలసాధన జేఏసీలు ఏర్పాటు చేసి పోరాడాల్సిన అవసరం ఉందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు హరగోపాల్‌, కన్వీనర్‌ రాఘవాచారి గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు నిధులు అన్నింటిని ఆంధ్ర ప్రాంతాల్లో వెచ్చించి, కృష్ణానది జలాల దోపిడీకి పాల్పడ్డారని ఆ క్రమంలో ఎన్నో పోరాటాలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ వచ్చినా.. పార్టీల అధికారం మారినా.. స్థానిక రైతులకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ తెలంగాణకు నీటి వాటా పంపిణీ చేయలేదని, గత ప్రభుత్వం కేంద్రంతో పోరాడి నీటివాటా సాధించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల గడుస్తున్నా కృష్ణానది జల సాధనకు కృషి చేయడం లేదని విమర్శించారు.

ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో వాణిజ్యశాస్త్ర విభాగం విద్యార్థులకు ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ చెన్నప్ప మాట్లాడుతూ బ్యాంకింగ్‌, బీమా, వ్యాపార, వాణిజ్య వంటి అంశాలను ఎన్ను కుని క్షణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఇలాంటి ప్రాజెక్టుల పరిశోధనల ద్వారా విద్యార్థుల వికాసం, సృజనాత్మకత, విశ్లేషణ నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కంట్రోలర్‌ రాజ్‌కుమార్‌, అనురాధారెడ్డి, రంగప్ప, సురేష్‌ పాల్గొన్నారు.

ఆరుగురికి పదోన్నతి

మహబూబ్‌నగర్‌ క్రైం: జోగుళాంబ జోన్‌–7 పరిధిలో ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇస్తూ గురువారం డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి వచ్చిన వారిలో చిన్ను నాయక్‌, బాలయ్య, బి.రాజు, వి.నాగరాజు, ఎం.వెంకటయ్య, రాములు, రాజేషం ఉన్నారు. వీరికి ఉమ్మడి జిల్లాలో పలు పోలీస్‌ స్టేషన్లలో పోస్టింగ్‌లు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement