
పకడ్బందీగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈనెల 24 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్‌ఓ కేవీవీ రవికుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 21 పరీక్ష కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 6,585 మంది, రెండో సంవత్సరం 3,719 మంది మొత్తం 10,304 మంది హాజరు కానున్నట్టు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందుగానే ఆయా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలన్నారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమన్నారు. గ్రామాల నుంచి సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఉదయం ఏడు గంటలకే అందుబాటులో ఉంచాలన్నారు. 144 సెక్షన్ అమలు చేయాలని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఐఈఓ శ్రీధర్‌సుమన్, డీఈసీ సభ్యులు ఉమామహేశ్వర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.