
అచ్చంపేట: పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలు.. ఎన్నికల్లో అభ్యర్థి గెలవాలన్నా, ఓడాలన్నా వారి కృషి మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం 10మంది పార్టీలో చేరితే చాలు ఓట్లు పడతాయనే ధోరణిలో ఆయా పార్టీల నాయకులు ఉన్నారు. ఇదే అదునుగా పార్టీలో చేరే కార్యకర్తలు నాయకులతో ఏకంగా క్యాష్ డీల్ కుదుర్చుకుంటూ కండువాలు మారుస్తున్నారు.
ఈ తరహా వ్యక్తులు పార్టీలో నిబద్ధతగా పని చేస్తారనే నమ్మకం లేదు. వేరే నాయకుడు ప్రలోబపెడితే ఆ పార్టీలోనూ చేరే రకం వీరిది. ఇదంతా ఒక ఎత్తయితే.. కొందరు నేతలు ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థుల ఎత్తుగడలను తెలుసుకునేందుకు తమ అనుచరులను కోవర్టులా ఇతర పార్టీల్లోకి పంపుతున్నారు.
చేరికల గోల..
ఓటర్లను తమవైపు ఎలా మలుపుకోవాలన్న దానిపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే గంటల వ్యవఽధిలోనే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీలు మారుతున్నారు.పెద్ద సంఖ్యలో చేరికలతో తమకు కలిసి వస్తుందని అభ్యర్థులు భావిస్తున్నప్పటికీ కొత్త తలనొప్పులు తప్పడం లేదు.
తమను సంప్రదించకుండానే కొత్త వారిని ఎలా చేర్చుకున్నారంటూ మొదటి నుంచి పార్టీలో పని చేస్తున్న నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గిట్టని వారిని పార్టీలో చేర్చుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. అలాంటి వారంతా పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.
బలహీన పరచడమే లక్ష్యం..
ఎదుటి వారిని బలహీనపరచడమే అసలు లక్ష్యంగా అభ్యర్థులు, ఆశావాహులు పావులు కదుపుతున్నారు. ఇందుకు కలిసి వచ్చే ఏ ఒక్క అంశాన్ని వదలి పెట్టడంలేదు. పార్టీలో చేరుతామని సమాచారమందిన వెంటనే హుటాహుటిన అక్కడికెళ్లి వాలిపోతున్నారు. ఆ వెంటనే కండువాలు కప్పేస్తున్నారు. ముందస్తు ముచ్చట మొదలైనప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల్లో ఎంతో మంది కండువాలు మార్చేశారు.
ఎదుటి పార్టీని బలహీనం చేయడంతోనే తమ గెలుపు ముడిపడి ఉందని కొందరు భావించి చేరికలను ప్రోత్సహిస్తున్నప్పటికీ.. సొంత పార్టీలో కొత్త అలకలు మొదలవుతున్నాయి. కొత్త చేరికలతో కోవర్టుల బెడద పెరిగిపోయి అసలుకే మోసం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఆచి తూచి అడుగులు వేయకుంటే గెలుపోటములపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఉన్న క్యాడర్‌ను కాపాడుకోగలిగితే విజయావకాశాలు మెరుగుపడే అవకాశముందని, ఆ దిశగా ఆలోచించాలని సూచిస్తున్నారు.
ప్రధాన పార్టీల్లోనే అధికం...
ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజులుగా ప్రధాన పార్టీల్లో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ను వదలి కాంగ్రెస్‌లోకి.. కాంగ్రెస్‌ను వదలి బీఆర్‌ఎస్‌లోకి చేరే వారే ఎక్కువగా ఉంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు నచ్చని వారు బీజేపీలోకి జారుకుంటున్నారు.
పార్టీ అధికారంలోకి వస్తుందా.. అభ్యర్థులు గెలిచే అవకాశముందా.. పార్టీ మారిన తమకు ఏమైనా కలిసి వస్తుందా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఆర్థికంగా ఏ మేరకు బలంగా ఉన్నారు.. ఇలాంటివి చూసుకొని గోడ దూకుతున్నట్లు తెలుస్తోంది.
కొందరు స్వచ్ఛందంగా పార్టీలు మారుతుండగా.. మరికొందరు స్థానిక సమస్యలు, భవిష్యత్ పరిణామాలను అంచనా వేసుకుంటూ జంప్ చేస్తున్నారు. ఇన్నాళ్లు నేతలపై కసితో ఉన్న అసమ్మతి నాయకులంతా జంపింగ్‌లతో అభ్యర్థులను శాసిస్తున్నారు. ఏదో రకమైన సాకుతో పార్టీ మారుతున్నామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.