
జడ్చర్ల: పట్టణంలో శనివారం గణేశ్ నిమజ్జనోత్సవం శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ నరసింహ తెలిపారు. గురువారం ఆయన నాగసాల గ్రామ సమీపంలో గణనాథులను నిమజ్జనం చేసే చెరువును పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా చెరువు వద్ద సరైన లైటింగ్, క్రేన్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండపాల నుంచి విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ లైన్ల వద్ద సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట మున్సిపల్ కమిషనర్ షేక్, సీఐ రమేశ్‌బాబు తదితరులు ఉన్నారు.
మెరుగైన వైద్యంఅందించాలి
అడ్డాకుల: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ కృష్ణ సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు ఇతర రికార్డులను పరిశీలించారు. ల్యాబ్‌ను తనిఖీ చేశారు. బీపీ చెక్ చేసే విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. జ్వరం, డెంగీ కేసులపై ఆరా తీశారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ భాస్కర్, ఫార్మసిస్ట్ కిరణ్, ల్యాబ్ టెక్నిషియన్ గోపాల్, సిబ్బంది భాగ్యలక్ష్మి, స్వాతి పాల్గొన్నారు.
గ్రంథాలయాలనుతీర్చిదిద్దుతాం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని గ్రంథాలయాలను అన్నివిధాలా అభివృద్ధి చేసి కొత్త శోభ తీసుకొస్తామని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పలు గ్రంథాలయాలకు కొత్త భవనాలు నిర్మించినట్లు తెలిపారు. మరో రెండు కొత్త భవనాలు నిర్మించేందుకు ఆమోదం లభించిందన్నారు. కోయిల్‌కొండకు రూ.60లక్షలు, హన్వాడకు రూ.68లక్షలు కేటాయించినట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయంలో పిల్లలు, మహిళల కోసం ప్రత్యేక షెడ్, తాగునీటి వసతికి బోరుబావి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.లక్ష, పుస్తకాల కొనుగోలుకు రూ.20లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పౌర పఠన మందిరాల నిర్వహణకు తీర్మానించామని, ఇందుకు రూ.1.50లక్షలు కేటాయించనున్నట్లు తెలిపారు. వెన్నాచేడ్ గ్రంథాలయంలోని నాలుగు దుకాణాలకు టెండర్ వేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో గ్రంథాలయ కార్యదర్శి మనోజ్‌కుమార్, శ్యాంసుందర్, మసియొద్దీన్, అనిత, మహ్మద్‌న్యూమన్ ఉన్నారు.
ఓటరు నమోదుపైఅలసత్వం వద్దు
కోయిల్‌కొండ: ఓటరు నమోదు ప్రక్రియపై అలసత్వం వహించవద్దని నారాయణపేట అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ భరత్ పాల్గొన్నారు.
29న వనపర్తికిమంత్రి కేటీఆర్ రాక
వనపర్తి: రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 29న జిల్లాకు వస్తున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. భగీరథ నీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని, బుగ్గపల్లితండా నుంచి మిషన్ భగీరథ ప్లాంట్ వరకు రహదారి నిర్మాణం, జిల్లాకేంద్రంలో ఇంటర్ లింక్స్ వెంటనే పూర్తి చేయాలన్నారు. చింతల హనుమాన్ రహదారి, గాంధీచౌక్ నుంచి రామాటాకీస్ వరకు చిన్న చిన్న రహదారి మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

