మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని ఓపెన్ ప్లాట్లు, నాలాలు దోమలకు నిలయంగా మారాయి. అసలే వర్షాకాలం.. ఆపై అపరిశుభ్రత వాతావరణం మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొందరు డెంగీ, విష జ్వరాల బారిన పడుతున్నారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో 2,88,026 మంది జనాభా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఓపెన్ ప్లాట్లు కాస్తా మురికి కుంటలుగా మారాయి. అంతటా ఓపెన్ నాలాలు ఉండటం.. అవి నిండి సమీపంలోని ఓపెన్ ప్లాట్లలోకి చేరుతున్నాయి. అలాగే చుట్టుపక్కలవారు వాటిలోనే చెత్తాచెదారం యథేచ్ఛగా వేస్తున్నారు. దీంతో పాటు పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి దోమలకు, పందులకు, పాములకు ఆవాసంగా మారాయి. గురువారం ‘సాక్షి’ పరిశీలనలో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఒకవైపు మున్సిపల్ అధికారులు ఆయా వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొంటున్నా.. ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. జిల్లాకేంద్రంలోని లక్ష్మీనగర్‌కాలనీ, సుబ్రమణ్య కాలనీ, భాగ్యనగర్‌కాలనీ, మర్లు, పాలకొండ, క్రిస్టియన్‌పల్లి, పాతపాలమూరు, గచ్చిబౌలి, రామయ్యబౌలి, శివశక్తినగర్, బండ్లగేరి, బండమీదిపల్లి, కుమ్మరివాడితో పాటు మిగిలిన ఏడు విలీన గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది.