
పాలకవర్గం చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్న ఆలయ ఈఓ పురేందర్‌కుమార్
గద్వాల అర్బన్: నడిగడ్డ ప్రాంత ఇలవేల్పు జములమ్మ అమ్మవారి ఆలయ కొత్త పాలకవర్గం గురువారం కొలువుదీరింది. ఆలయ చైర్‌పర్సన్‌గా కుర్వ గాయత్రి ఎన్నికవగా.. గుండ్రాతి సంధ్య, పాత్వరమ్మ, జయమ్మ, సంధ్య, మహేశ్వరి, భవాని, సునీత, శారద, ఓంప్రకాష్ కాంళ్లే, నాగరాజు, బంగి ధనియాలు, జమ్మన్న, ఎక్స్ ఆఫిసియో మెంబర్ రాజు గౌడ్‌చే ఆలయ ఈఓ పురేందర్ కుమార్, ఎండోమెంట్ ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్వరమ్మ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నూతన చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులను పలువురు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా రైతుబంధు అధ్యక్షుడు చెన్నయ్యతో పాటు మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ హాజరై నూతన పాలకవర్గానికి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్ములమ్మ ఆలయం రోజురోజుకు అభివృద్ది చెందుతుందన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో ఆలయ ఆభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఆనంతరం ఆలయ ఈఓ పురేందర్ కుమార్ మాట్లాడారు. దేవాదాయశాఖ తరుపున 14మంది ఆలయ పాలకవర్గంలో 9మంది మహిళలు నియామకం కావడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అన్నారు. కార్యక్రమంలో మాజీ ఆలయ చైర్మన్ సతీష్, మాజీ అలయ సభ్యులు జానకిరాములు తదితరులు ఉన్నారు.
కొలువుదీరినకొత్త పాలకవర్గం