
స్టేషన్ మహబూబ్‌నగర్: డయల్ యువర్ ఆర్‌ఎంకు ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను పరిశీలించి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్‌ఎం కార్యాలయంలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ ఆర్‌ఎం కార్యక్రమం నిర్వహించి ప్రయాణికుల నుంచి ఆర్టీసీకి సంబంధించిన ఫిర్యాదులు తీసుకున్నారు. మహబూబ్‌నగర్ బైపాస్ మీదుగా దివిటిపల్లి నుంచి భూత్పూర్ వరకు పల్లె వెలుగు బస్సులు నడపాలని, మహబూబ్‌నగర్ నుంచి నవాబ్‌పేట–కొత్తపల్లి నైట్‌హాల్ట్ బస్సును పునరుద్ధరించాలని, రాత్రి 7 గంటల తర్వాత షాద్‌నగర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు బస్సు నడపాలని చాలా మంది కోరారు. నాగర్‌కర్నూల్ నుంచి పల్లెవెలుగు బస్సును రేవల్లి వరకు పొడిగించాలని, నాగర్‌కర్నూల్ మెడికల్ కళాశాల వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని, మహబూబ్‌నగర్ పట్టణంలో సిటీ బస్సులు నడపాలని, అచ్చంపేట–లింగాల నైట్ హాల్ట్ సర్వీసు, సాయంత్రం 6 గంటల తర్వాత ఆత్మకూర్ మీదుగా వడ్డేమాన్ నుంచి మహబూబ్‌నగర్ వరకు బస్సు నడపాలని కోరారు.
ముందస్తు టికెట్ బుకింగ్‌కు 10శాతం రాయితీ
స్టేషన్ మహబూబ్‌నగర్: దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించినట్లు రీజినల్ మేనేజర్ శ్రీదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్ బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈనెల 30 వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. రిజర్వేషన్ సదుపాయమున్న అన్ని సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్ tsrtconline.in చూసుకోవాలని కోరారు.