
గట్టు: నడిగడ్డ ధర్మపంటగా పిలువబడే గొర్తవరి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆస్మాన్ తరి (ఆకాశం నుంచి జాలు వారే చినుకులకు పండే వరిపంట) వర్షాబావంతో ఎండు ముఖం పట్టింది. కేవలం వర్షాధారంగా గట్టు, కేటిదొడ్డి, ధరూరు మండలాల్లో సాగు చేసే గొర్తవరి పంట ఎండుతోంది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభం నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఆగస్టు మాసంలో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో గొర్తవరికి గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. పొట్టదశలో వర్షాలు లేక పోవడంతో గొర్తవరి ఎండుకుంటు వస్తోంది. సకాలంలో వర్షాలు కురిస్తే సెప్టెంబర్ చివరి నాటికి గొర్తవరి కొతకు వచ్చేది. వానాకాలం ప్రారంభంలో జూన్ రెండో వారం నుంచి జూలై రెండో వారం వరకు గొర్తవరి రైతులు వర్షాలకు అనుగుణంగా వరిని విత్తుకుంటుంటారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల పిచికారీ లేకుండా, కేవలం వర్షాధారంగా వరిని ఇక్కడ పండిస్తుంటారు. విత్తుకున్న 95 రోజులకు వరి పంట కోతకు వస్తుంది. ఎకరాకు 20 నుంచి 25 బస్తాల దిగుబడి వస్తుంది. గట్టు మండలంలో సుమారు 3500 ఎకరాల్లో గొర్తవరి సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో వర్షాధారంగా గొర్తవరిని పండించడం ఇక్కడి ప్రత్యేకత. సాగు వసతి కారణంగా నీటి కాల్వలు రావడంతో గొర్తవరికి బదులుగా కొందరూ రైతులు వరి నాట్లు వేస్తున్నారు. సాగు నీటి వసతి లేని గట్టు పడమర, ఉత్తరం భాగాలు, తారాపురం, జోకన్‌గట్టు, సల్కాపురం, రాయాపురం, యల్లందొడ్డి, మాచర్ల గ్రామాలతో పాటు కేటీదొడ్డి మండలం చింతకుంట, సోంపురం, యర్సన్‌దొడ్డి, మల్లాపురం, మల్లాపురంతండా, కుచినేర్ల గ్రామాల్లో ఇప్పటికి గొర్తవరిని రైతులు సాగు చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి సంగతి అటుంచితే కనీసం తిండి గింజలు కూడా దక్కే పరిస్థితి లేదని గొర్తవరి సాగు చేసిన రైతులు వాపోతున్నారు.
వర్షాధార వరికి గడ్డు పరిస్థితి
ఆందోళనలో అన్నదాత

గట్టు శివారులో ప్రస్తుతం వర్షాల్లేక ఎండిన గొర్తవరి