
అటవీ సిబ్బందికి సూచనలిస్తున్న రేంజ్ అధికారి ఆదిత్య
మన్ననూర్: అమ్రాబాద్ డివిజన్ మద్దిమడుగు రేంజ్ పరిధి సోమచెల్కలో గడ్డి క్షేత్రాల (గ్రాస్ ల్యాండ్) నిర్వహణపై రేంజ్ అధికారి ఆదిత్య సిబ్బందికి గురువారం అవగాహన కల్పించారు. అచ్చంపేట డివిజన్‌కు చెందిన అమ్రాబాద్, మన్ననూర్, దోమలపెంట, లింగాల, అచ్చంపేట రేంజ్‌ల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్డి క్షేత్రాల నిర్వహణ, ప్రాధాన్యాన్ని వివరించారు. గడ్డి మైదానాలు సమృద్ధిగా ఉంటే శాఖాహార జంతువులు, అలాగే పెద్దపులుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. నల్లమల, అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం మూడురకాల గడ్డి క్షేత్రాలను పెంచేందుకు అనువుగా ఉందని వివరించారు. గడ్డి క్షేత్రాలను ఆశించినస్థాయిలో పెంచితే వన్యప్రాణుల మనుగడకు కొదవ ఉండదని తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలోకి ఇతర ప్రాంతాల వారు చొరబడి వన్యప్రాణులను వేటాడారని.. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో రేంజ్ అధికారులు ఈశ్వర్, శరత్‌చంద్ర, డీఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, బీట్ అధికారులు, వాచర్లు పాల్గొన్నారు.