
జింకులోపంతో ఉన్న వరి మొక్కలు
జింకు లోపాన్ని ఇలా గుర్తించాలి..
వరి నాడు మడి దశలోనూ నాటిన తర్వాత కూడా జింకు లోపం కనిపిస్తోంది. సాధారణంగా నాట్లు వేశాక రెండు నుంచి నాలుగు వారాల మధ్య నాలుగు నుంచి ఆరు వారాల మధ్య జింకు లోపం లక్షణాలు బయటపడుతాయి. జింకు లోపం ఉన్న పొలాల్లో ప్రధాన పోషకాలు తగినంత వేసినా పంట సరిగా పెరగదు. పిలకలను పెట్టదు. పొలంలో మొక్కలు చనిపోయి ఖాళీలు కనిపిస్తాయి. పొలం అంత పసుపు పచ్చగా కనబడుతుంది. దగ్గరగా చూస్తే మొక్కల్లో పైనుంచి మూడు లేక నాలుగు ఆకుల మధ్య ఈనె మొదలు భాగం ఆకు పచ్చ రంగు కోల్పోయి పసుపుతో కూడిన తెలుపు రంగులోకి మారుతుంది. ఆకులోని మిగిలిన భాగం అంతా ఆకు పచ్చగానే ఉంటుంది. ఆకులు చిన్నగా నూలు కండిలుగా మారి మొద్దు బారుతాయి. గట్టిగా మారి వంచి చూస్తే శబ్దం చేస్తూ విరుగుతాయి.
అలంపూర్: వరి సాగు పనులు కొనసాగుతున్నాయి. పంట సాగుకు అనువుగా అనేక మంది రైతులు వరి నారుమడులు పోసుకున్నారు. మడుల్లో జింకు లోపం లక్షణాలు ఉన్నాయేమో రైతులు పరిశీలించుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియ నాయక్ రైతులకు సూచిస్తున్నారు. లక్షణాలను గుర్తిస్తే తక్షణమే సస్యరక్షణ చర్య లు చేపట్టాలని సూచించారు. లేకుంటే ఎన్ని ఎరువులు వేసినా వ్యర్థమేనని పేర్కొన్నారు.
జింకు లోపం, లక్షణాలు, నివారణ చర్యలు..
వరిలో ఎరువుల యాజమాన్య పద్ధతులు సద్వినియోగం కావాలన్నా.. అధిక దిగుబడి సాధించాలన్నా.. జింకు లోపం నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలి. పైరు పెరుగుదలకు అవసరమైన పోషకాలను, నత్రజని, భాస్వరం, పొటాషియం ప్రధానమైనవి. వీటితో పాటు జింకు, కాల్షియం, మెగ్నీషియం వంటి తదితర 16 రకాల సూక్ష్మధాతువులు కూడా అవసరం. వీటిలో జింకు పాత్ర కీలకం. ప్రధాన పోషకాలతో పోల్చితే ఇది చాలా తక్కువ పరిమాణంలో అవసరమైనా.. ప్రాముఖ్యత విషయంలో ప్రధాన పోషకాలతో సమానం. జింకు లోపిస్తే ఎన్ని ఎరువులు వేసినా.. ఎటువంటి ఉపయోగం ఉండదు.
జింకు లోపిస్తే ఎరువులు వృథా..
జింకు లోపం ఉంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎంత వేసినా వృథాగా మారుతాయి. మొక్కలు, ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకోలేవు. దిగుబడి పెరగవు. మొక్కల పెరుగుదల కోసం పలు రసాయన ప్రక్రియలో అవసరమయ్యే ఎంజైములు చురుకుదనాన్ని పెంచడానికి, ఉత్తేజ పర్చడానికి జింకు ఉపయోగపడుతుంది. ఈ పోషకం లోపిస్తే ఆ ప్రక్రియ సజావుగా జరగవు.
ముందస్తు చర్యలు ఇలా..
జింకు లోపం ఉన్నట్లు తేలితే తప్పనిసరిగా ముందుగానే సరైన మోతాదులో జింకు సల్ఫేట్ వేసుకోవాలి. వరి పంటకై తే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను దుక్కిలో నాటే ముందు వేసుకోవాలి. మూడు పంటలకు ఒకసారి లేక రెండేళ్లకు ఒక సారిగాని వేసుకోవాలి. ఏటా వరి సాగు చేస్తుంటే యాసంగిలోనే జింకు వేసుకోవాలి. సమస్యత్మాక నేలలు అంటే క్షార చౌడు సున్నపు నేల అయితే జింకు సల్ఫేట్‌ను ఎకరానికి 40 కిలోల చొప్పున వేసుకోవాలి.
నివారణ చర్యలు ఇలా..
వరిలో జింకు లోపం కనిపిస్తే పది లీటర్ల నీటికి 20 గ్రాముల జింకు సల్ఫేట్ కలిపి ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. ఇలా వారం రోజుల వ్యవధిలో రెండు, మూడు దఫాలు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎకరానికి రెండు క్వింటాళ్ల పశువుల ఎరువులు, కంపోస్టు, కోడి ఎరువు, ఫిల్టర్ మట్టి వంటి సేంద్రియ ఎరువులతో 15 కిలోల జింకు సల్ఫేట్ కలిపి నెల రోజులు మాగనిచ్చి నాటే ముందు దుక్కిలో వేస్తే దిగుబడుల్లో మార్పు కనిపిస్తుంది.
అధికారి సలహా
సక్రియనాయక్
ఏడీఏ, అలంపూర్
