
విద్యార్థుల జానపద నృత్యం
● రెండోరోజు ఉత్సాహంగా
పాల్గొన్న విద్యార్థులు
● ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
స్టేషన్ మహబూబ్‌నగర్: చిన్నారుల ఆటపాటల కేరింతలు ఒకవైపు.. పద్యపఠనం, దేశభక్తి గీతాలాపన మరోవైపు.. మట్టితో బొమ్మల తయారీ, బాల విజ్ఞానుల ప్రయోగ సైన్స్ ఫెయిర్ ఇంకోవైపు.. ఇలా అన్ని వైపులా జిల్లాకేంద్రంలోని బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో పిల్లల పండుగ 2వ పిల్లలమర్రి బాలోత్సవం శుక్రవారం ఆనందోత్సహాల మధ్య అట్టహాసంగా ముగిసింది. రెండోరోజు బాలోత్సవంలో దాదాపు 10 వేదికల్లో చిన్నారులు ఉత్సాహంగా ఈవెంట్లలో పాల్గొన్నారు. బేబీ జూనియర్, జూనియర్, సీనియర్స్ విభాగాల్లో విద్యార్థులు ఆయా ఈవెంట్లలో పోటీపడ్డారు. జానపద నృత్యాలు, ఏకపాత్రాభినయం, సంప్రదాయ నృత్యాలు, దేశభక్తిగీతాలతోపాటు బతుకమ్మ, కథలు చెప్పడం, పద్యం భావం, ఉపన్యాసం, స్పెల్‌బీ, సైన్స్ ఎగ్జిబిషన్, మట్టిబొమ్మలు ఈవెంట్లు నిర్వహించగా విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాలను చక్కగా ప్రదర్శించారు. బాలోత్సవంలో మెజీషియన్ నరేష్ ప్రదర్శనలు ఆకట్టుకుంది. జిల్లాలోని 70 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన సుమారు 4 వేల మంది విద్యార్థులతో బాలోత్సవం సందడిగా మారింది.
సమష్టి కృషితో..
అందరి ప్రోత్సాహం, సమష్టి సహకారంతో బాలోత్సవం విజయవంతమైనట్లు పిల్లలమర్రి బాలోత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బెక్కం జనార్దన్, డాక్టర్ ప్రతిభ అన్నారు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడుతామన్నారు. బాలోత్సవం విజేతలకు జేపీఎన్‌సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్, మల్లిక ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ మహేష్‌బాబు, డాక్టర్ ఏగూరు ఇందిర తదితరులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బాల స్వేచ్ఛ సంస్థ ప్రతినిధి కిరణ్‌చంద్, జగపతిరావు, వీణ శివకుమార్, జగపతిరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

గెలుపొందిన విద్యార్థులతో కమిటీ సభ్యులు