న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026
సాక్షి మహబూబాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారు. అయితే ఉరుములు, మెరుపులు, గాలిదుమారం, అకాల వర్షాలతో రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు చేస్తే గిట్టుబాటు ధర వస్తుందని ఆశించిన రైతులకు కొనుగోళ్లలో జాప్యం శాపంగా మారింది. వారాల తరబడి క కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్నలు పోసి ఎప్పుడు కాంటాలు పెడుతారా అని ఎదుచూస్తున్నారు.
మందకొడిగా మక్కల కొనుగోళ్లు
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో మొక్కజొన్న పంట సాగు పెరిగింది. దీంతో దిగుబడి కూడా ఎక్కువగానే వచ్చింది. అయితే ప్రభుత్వం మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు కోరడంతో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. యాసంగి సీజన్‌లో 1,05,238 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. ఇందుకు గాను 4లక్షల మెట్రిక్ టన్నుల మొక్క జొన్నల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 25శాతం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ లెక్కన లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి. కానీ, ఇప్పటి వరకు 25 కొనుగోలు కేంద్రాల ద్వారా 42వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే రెండు నెలలు గడిచినా సగం మొక్కజొన్నలు కూడా కొనుగోలు చేయలేదు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమశాతంతో పాటు శుభ్రంగా ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేసి, వెంటనే మిల్లులకు ఎగుమతి చేయాలని జిల్లా అధికారులు చెబుతున్నా.. జిల్లాలో మాత్రం నత్తనడకన కొనుగోళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. యాసంగిలో రైతులు 1,71,780 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందుకుగాను రైతుల అవసరాలు, ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు పోగా 2,60,762 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు అంచనా వేశారు. ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా మొత్తం 213 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ఇప్పటి వరకు 136 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 17,175 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. ఇందులో కేవలం 8,900 మెట్రిక్ టన్నులు మిల్లులకు తరలించారు. ఇంకా 8,275 మెట్రిక్ టన్నుల ధాన్య ం కేంద్రాల్లోనే నిల్వ ఉంది.
అన్నదాతల ఆందోళన..
పొద్దస్తమానం తీవ్రమైన ఎండతో ఉన్న వాతావరణం సాయంత్రం కాగానే మబ్బులు చేస్తుంది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు, పిడుగులతో గాలిదుమారం వస్తుంది. దీంతో ఽకొనుగోలు కేంద్రాల్లో పోసిన రైతులు పంటలు తడవకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పంటను రాసిగా పోయడం, టార్పాలిన్లు కప్పడం, వర్షం నీరు రాకుండా కట్టలు కట్టడం కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇందుకోసం వర్షానికి తడవడం, పిడుగులు ఎప్పుడు మీద పడుతాయో అని భయం భయంగా ఉంటున్నారు. జిల్లా అధికారులు స్పందించి మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, తేమశాతం సక్రమంగా ఉన్న ధాన్యం వెంటనే కాంటాలు పెట్టి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కల్లాల్లో ధాన్యం, మొక్కజొన్న నిల్వలు
కొనుగోళ్లలో జాప్యంతో రైతుల నిరీక్షణ
సరుకులు తడుస్తాయని ఆందోళన


