● తొర్రూరు ఆర్డీఓ గణేష్
● తొలిరోజు 20 అర్జీల స్వీకరణ
తొర్రూరు: ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నదే ప్రభుత్వ సంకల్ప మని తొర్రూరు ఆర్డీఓ జి. గణేష్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. తొలిసారి కార్యక్రమానికి స్థానికుల నుంచి 20 దరఖాస్తులు అందాయి. దానిలో 15 భూ సంబంధిత, 5 పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, న ర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాలకు సంబంధించిన వారు ఫిర్యాదులు ఆర్డీఓకు అందించారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ...ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ పుల్లారావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుగుణాకర్‌రాజు, విద్యుత్ శాఖ డీఈ రవి, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, సీడీపీఓ కమలాదేవి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈజీఎస్ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి: కొరిపెల్లి గ్రామస్తులు
పెద్దవంగర మండలం కొరిపెల్లి గ్రామంలో ఉపాధిహామీ పథకంలో ఈ ఏడాది జనవరిలో మట్టి రోడ్డు పనులు చేపట్టారు. సదరు పనుల నిమిత్తం 220 ట్రిప్పుల మట్టి తరలించగా, 700 ట్రిప్పులు తరలించినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఉపాధిహామీ పనిలోనే కూలీలతో చేయించగా కాంట్రాక్టర్ చేసినట్లుగా పేర్కొంటూ రూ.3.26 లక్షల ఖర్చు చూపించి అనివీతికి పాల్పడినట్లు కొరిపెల్లి గ్రామస్తులు ప్రజావాణిలో ఆర్డీఓ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలని మండల స్థాయి అధికారులకు ఆర్డీఓ తెలిపారు.
పింఛన్ అందడం లేదని..
తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృదుడు కొమ్ము వెంకట్రాములు వేలిముద్రలు పడక మూడు మాసాలుగా పింఛన్ అందడం లేదని ఆర్డీఓకు మొరపెట్టుకున్నాడు. పింఛన్ అందక అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు వృద్ధుడు తెలిపాడు. తన సమస్యపై గతంలో పంచాయతీ కార్యదర్శికి, గ్రామ పాలకులకు బాధితుడు తెలిపాడు. పరిష్కారం కాకపోవడంతో ప్రజావాణిలో ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు. కాగా పేషియల్ రికగ్నైజేషన్ ప్రక్రియ ద్వారా పింఛన్ అందేలా చూడాలని ఆర్డీఓ అధికారులను ఆదేశించారు.
సత్వర పరిష్కారం కోసమే..
మహబూబాబాద్: సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయ పరిధిలోని మానుకోట, కేసముద్రం, ఇనుగుర్తి, డోర్నకల్, కురవి, సీరోలు, బయ్యారం, గార్ల, గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల ప్రజలు వినతులు అందజేస్తారు. ఈమేరకు ఆర్డీఓ కృష్ణవేణి మాట్లాడుతూ.. 11 మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై ఆర్డీఓ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వినతులు ఇవ్వాలన్నారు. అధికారులు వినతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇచ్చిన గడువులోగా పరిష్కారం కావాలని, లేనిచో కారణంతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. కాగా తొలిరోజు 13 వినతులు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, మానుకోట మండలం మల్యాల గ్రామశివారు దామ్యాతండాకు చెందిన బానోత్ చందూలాల్ తన భూ సమస్య పరిష్కరించి పట్టా మంజూరు చేయాలని మొదటి వినతి అందజేశాడు.
నా స్థలం కబ్జా చేశారు..
గ్రామంలో నా ఇంటి స్థలం కబ్జా చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. తహసీల్దార్‌కు వినతి ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో విచారణ చేసి న్యాయం చేయాలి.
– కె.నారాయణ,
రామన్నగూడెం గ్రామం, నర్సింహులపేట
పింఛన్ మంజూరు చేయాలి
2023లో ఆరోగ్య సమస్యతో ఎడమ కాలు చచ్చు బడిపోయింది. అదే సంవత్సరం 70శాతం దివ్యాంగుడిగా సదరం సర్టిఫి కెట్ ఇచ్చారు. కానీ దివ్యాంగ పింఛన్ మంజూరు కాలేదు. అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలి.
–నీరుటి వీరభద్రం, తోడేళ్లగూడెం, డోర్నకల్


