సర్వేపై స్పష్టతేది? | - | Sakshi
Sakshi News home page

సర్వేపై స్పష్టతేది?

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

మహబూబాబాద్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో బాగంగా బాలరక్షాభవన్‌ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని పిల్లల గురించి సర్వే చేశారు. సుమారు 15 రోజుల పాటు సర్వే చేయగా జిల్లాలో 3,209 మంది ఉన్నట్లు తేలింది. ఇందులో తల్లిదండ్రులు చనిపోయిన వారి పిల్లలు 195 మందిగా గుర్తించారు. వారిని మిషన్‌ వాత్సల్య పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే సర్వే పూర్తి చేసిన అధికారులు.. పూర్తి ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వలేదు.

ఐదు ప్రాజెక్ట్‌లు..

డీడబ్ల్యూఓ పరిధిలో ఐదు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఆశాఖ పరిరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు, సఖి కేంద్రం, మహిళా సాధికారత కేంద్రం, బాలరక్షా భవన్‌, ఇతర కేంద్రాలు నిర్వహిస్తున్నారు. బాలరక్షా భవన్‌ పరిధిలో కూడా ఏడు విభాగాలు ఉన్నాయి. దానిలో బాలరక్షా భవన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ డిస్ట్రిక్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌తో పాటు మరో 35మంది సిబ్బంది పని చేస్తున్నారు. బాల రక్షా భవన్‌ ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

15 రోజుల పాటు సర్వే..

తల్లితండ్రులు లేని పిల్లలు, తల్లి లేక తండ్రి చనిపోయిన పిల్లలు, తల్లిదండ్రులు ఉండి ఆదరణ లేని పిల్లలు, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఇలా నాలుగు విభాగాలుగా ఫార్మట్‌ తయారు చేసి సర్వే చేపట్టారు. ఈమేరకు సీడీపీఓల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లతో సర్వే చేశారు. కాగా, తొర్రూరు ప్రాజెక్ట్‌ పరిధిలో 787మంది పిల్లలు, మానుకోట పరిధిలో 775మంది, డోర్నకల్‌ పరిధిలో 851మంది, మరిపెడ పరిధిలో 721మంది, గూడూరు ప్రాజెక్ట్‌ పరిధిలో 75మంది.. మొత్తంగా 3,209 మందిని గుర్తించారు. వారి చదువు, నివాసం, ఆధార్‌ నంబర్‌ తదితర వివరాలు సేకరించారు.

మిషన్‌ వాత్సల్య పథకం ద్వారా లబ్ధి..

కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి మిషన్‌ వాత్సల్య పథకం అమలు చేస్తుంది. పథకం కోసం నేటి వరకు 1,810 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, గైడ్‌లైన్స్‌ ప్రకారం 225 మందికి స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారు. ప్రతీ నెల వారి ఖాతాలో రూ.4000 జమ చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు మొదటి ప్రాధాన్యం, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నారు.

సర్వే తర్వాత ప్రాసెస్‌పై లేని స్పష్టత

సుమారు 15 రోజుల పాటు సర్వే చేసి 3,209 మందిని గుర్తించారు. వారికి మిషన్‌ వాత్సల్య పథకంతో పాటు ఇంకా ఏమైనా లబ్ధి చేకుర్చాలనే ఆలోచనతో ప్రభుత్వం సర్వే చేసిందా అనే విషయంపై స్పష్టత లేదు. ప్రత్యేకంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సర్వే చేయాలని ఆదేశాలు రావడంతో ఈనెల 1వ తేదీతో సర్వే పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తదుపరి ప్రక్రియ మొదలు పెడుతామని అధికారులు చెబుతున్నారు.

పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మిషన్‌ వాత్సల్య పథకాన్ని అర్హత గల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. గైడ్‌లైన్స్‌ ప్రకారం అన్ని పత్రాలు జత చేయాలి. ఆ పిల్లల కోసం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు సర్వే చేశాం. నివేదికను తయారు చేస్తున్నాం. దానిని ప్రభుత్వానికి పంపిస్తాం. ఆదేశాలతో తదుపరి ప్రాసెస్‌ చేస్తాం.

–ఎస్‌.రాజ్యలక్ష్మి , బాల రక్షా భవన్‌ కోఆర్డినేటర్‌

తల్లిదండ్రులు లేని పిల్లలపై

15రోజుల పాటు సర్వే

అంగన్‌వాడీ టీచర్లతో నిర్వహణ

మిషన్‌ వాత్సల్య పథకంలో స్కాలర్‌షిప్‌లు

బాల రక్షాభవన్‌ ఆధ్వర్యంలో భరోసా

ఇతర లబ్ధిపై స్పష్టత కరువు

Advertisement
 
Advertisement
Advertisement