కురవి: విద్యుదాఘాతంతో మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి సీరోలు మండలం బీల్యా నాయక్ తండా పరిధిలోని పలుగుబోడు తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ముగ్గురు రైతుల పశువులు మేత కోసం బయటకు వెళ్లాయి. ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో విద్యుత్‌తీగలు తెగి కిందపడ్డాయి. మేత కోసం వెళ్లిన రెండు ఎడ్లు, ఒక ఆవు కాళ్లకు విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. తేజావత్ సేవ్యాకు చెందిన ఒక ఆవు, వాకుండోత్ మోహన్, బానోత్ నెహ్రూకు చెందిన రెండు ఎడ్లు చనిపోయాయి. సోమవారం వాటిని తండా శివారులో గుర్తించారు. విద్యుత్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పశువులకు పరిహారం చెల్లించాలని రైతులు వేడుకున్నారు.


